సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఫ్యాన్సీ నంబర్ దక్కించుకోవడానికి పోటీ పడే వారి సంఖ్య ఏడాదిన్నరగా క్రమంగా తగ్గుతున్నది. ఎప్పుడైనా 9999 నంబర్ అత్యంత అధిక ధరతో అమ్ముడుపోతుంది. కానీ ఇటీవల కాలంలో ఆ నంబర్ కూడా కేవలం 10 లక్షల లోపే ధర పలుకుతున్నది. దీనికి కారణం వాహనాల కొనుగోళ్లు తగ్గడం, రియల్ ఎస్టేట్ పరిస్థితులు దిగజారడం వంటి కారణాలతో పెద్దగా ఫ్యాన్సీ నంబర్లపై ఆసక్తి చూపడం లేదని అధికారులు చెబుతున్నారు.
ఈ క్రమంలో రవాణా శాఖ అధికారులు ఇటీవల తీసుకొచ్చిన మార్పులతో ఫ్యాన్సీ నంబర్ల ధరలు భారీగా పెంచారు. గతంలో 9999 దక్కించుకోవాలంటే రూ. 50వేల ఫీజు చెల్లించి ఆపై బిడ్డింగ్‌లో పాల్గొనేవాళ్లు. కానీ ఇప్పుడు ఈ 9999 నంబర్‌ను దక్కించుకోవాలంటే 1.50 లక్షల ఫీజు చెల్లించాల్సిందే. ఆ తర్వాత బిడ్డింగ్‌లో పాల్గొనాలి.
కాగా, గతంలో 1,9 నంబర్లకు రూ.50వేలు ఉంది. ఇప్పుడు లక్ష రూపాయల ఫీజు ఉంది. 3333,4444,5555,7777, 8888 రూ.30వేలు గతంలో ఉంది. ప్రస్తుతం రూ. 50 వేలు ఉంది. ఇలా ఫ్యాన్సీ నంబర్ల ఫీజులు ఇష్టానుసారంగా పెంచడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ఫ్యాన్సీ నంబర్లపై ఆసక్తి తగ్గుతున్నా.. ఫీజులు పెంచడంపై వారు మండిపడుతున్నారు.
దరఖాస్తు ఇలా..!
ఫ్యాన్సీ నంబర్‌పై ఆసక్తి ఉన్న బిడ్డర్లు తెలంగాణ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్ వెబ్సైట్లోకి వెళ్లి కుడివైపు ఆన్లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే నంబర్ రిజర్వేషన్ ఆనే లింకు కనిపిస్తుంది. దానిని ఓపెన్ చేస్తే ఆ రోజు అందుబాటులో ఉన్న నంబర్లు ప్రత్యక్షమవుతాయి. అందులో నచ్చిన నంబర్ కావాలనుకుంటే సంబంధిత నంబరు పేర్కొంటూ.. వాహన టీఆర్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వివరాలు సమర్పించిన తర్వాత వాహనదారుడు ఎంచుకున్న నంబర్ ఆధారంగా యాక్షన్‌లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. తొలుత రవాణా శాఖ నిర్ణయించిన ఫీజు చెల్లించాలి. అందుకోసం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు బిడ్‌లో పాల్గొనాలి. అనంతరం 5 గంటల వరకు నంబర్ ఖరారై రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు సందేశం వస్తుంది.
రవాణా శాఖ నిర్ణయించిన ప్రస్తుత ఫీజులు
నంబర్ : ప్రస్తుతం
9999 : 1.50లక్షలు
1, 9, 6666 : లక్ష రూపాయలు
99, 999,3333,4444,5555,7777 : 50వేలు
5,6,7,123,333,369,555,666,777 : 40వేలు
3, 111,234,567,1999,3999,5678,5999,9009 : 30వేలు