Lowest Temperature in Hyderabad | హైదరాబాద్ నగరం గజగజ వణికిపోతోంది. ఒక ఊటీ, ఒక కొడైకెనాల్, ఒక సిమ్లా వాతావారణం ప్రస్తుతం హైదరాబాద్‌లో కనిపిస్తోంది. సాధారణంగా చలికాలంలో చలి తీవ్రత ఎక్కడైనా ఉంటుంది. కానీ.. ఎక్కడా లేనివిధంగా ఈసారి హైదరాబాద్‌లో గత మూడు నాలుగు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి.
శనివారం తెల్లవారుజామున పటాన్చెరు ప్రాంతంలో 8.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. గతంతో డిసెంబర్ 13, 2015న హైదరాబాద్‌లో 9.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. అప్పట్లో అదే అత్యల్పం.
సిటీలో ఓవర్ఆల్గా మినిమమ్ 12.5 డిగ్రీ సెల్సియస్‌గా నమోదు అయింది. ఇది సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువ. మరో నాలుగు అయిదు రోజుల వరకు ఉష్ణోగ్రత మరింత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 3 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉందని.. అలాగే గంటకు ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో చల్లని గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
శనివారం నాడు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రత నమోదు అయింది. సంగారెడ్డిలో 6.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో అది గత 10 ఏళ్లలో అత్యల్పంగా నమోదు అయింది. దీంతో వాతావరణ శాఖ డిసెంబర్ 21 వరకు నగర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అలాగే.. ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్ జిల్లాలకు వచ్చే కొన్ని రోజుల వరకు ఆరెంజ్ వార్నింగ్‌ను వాతావారణ శాఖ జారీ చేసింది.