సిటీబ్యూరో: హై సైక్యూరిటీ రిజిస్ట్రేషన్ప్లేట్స్ బిగింపు రవాణా శాఖకు కొత్త తలనొప్పిగా మారింది. చాలా మంది వాహనదారులు గతంలో వివిధ కారణాల రీత్యా వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో హెచ్ఎస్ఆర్ నంబర్ ప్లేట్స్ బిగింపు చేసుకోలేదు. దీంతో ఇప్పుడు ఆ వాహనం మరో వ్యక్తికి కొనుగోలు చేయాలంటే కచ్చితంగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ ఉండాల్సి ఉంటుంది.ఈ క్రమంలో చాలా మంది వాహనదారులు తమ పాత నంబర్ ప్లేట్స్ కోపం సంబంధిత ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. షోరూంల్లోనే నంబర్ ప్లేట్స్ బిగింపు ఉంటుందని చెప్పడంతో అక్కడికి వెళ్లి ఆరా తీస్తున్నారు.
ఈ క్రమంలో కొందరి వాహనాల వివరాలు షోరూంల్లో నమోదు కాకపోవడంతో తాము నెంబర్ ప్లేట్ కేటాయించలేమని చెబుతున్నారు. దీంతో ఆర్టీఏ కార్యాలయాలకు మళ్లీ సంప్రదించాల్సి వస్తున్నది. ఇలాంటి కేసుల్లో ఆర్టీఓలే సంబంధిత సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. దీంతో అధికారులకు వాహనదారులు తమ మొరపెట్టుకుంటున్నారు. కొందరు అధికారులు సమస్యను పరిష్కరించగా మరికొందరు తమకు సంబంధం లేదని చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక మధ్యవర్తులను ఆశ్రయించి డబ్బులు అప్పజెప్పాల్సి వస్తుందని బాధితులు చెబుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు సంప్రదించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.