సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ) : విపత్తు నిర్వహణలో ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) విభాగం ప్రత్యేకతను చాటుతున్నది. వాతావరణ శాఖను సమన్వయం చేసుకుంటూ నగర పౌరులకు ముందస్తుగా ట్విట్టర్, ఎస్ఎంఎస్ల రూపంలో అప్రమత్తం చేస్తున్నది. ఎక్కడ ఏ ఫిర్యాదు వచ్చినా క్షణాల్లో చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నది. క్షేత్రస్థాయిలో 27 బృందాలతో 500 మంది డీఆర్ఎఫ్ సిబ్బంది 24 గంటల పాటు నిత్యం ముఖ్యమైన ప్రదేశాల్లో అలర్ట్‌గా ఉంటూ విపత్తు నివారణ చర్యలు చేపడుతున్నది. క్షేత్రస్థాయిలోనే కాకుండా వాతావరణ శాఖ ముందస్తు అంచనాను దృష్టిలో ఉంచుకొని భారీ వర్ష సూచన ఉందని, చెట్ల కింద, శిథిల భవనాలు, ఇతర సెఫ్టీ లేని నిర్మాణాల వద్ద ఉండవద్దని సూచిస్తూ ప్రజల ఫోన్లకు సమాచారం చేరవేర్చుతున్నది. ఈ క్రమంలోనే మంగళవారం ఒక్క రోజూ 70 లక్షల మంది సిటీజన్స్‌కు ఎస్ఎంఎస్లు పంపి అలర్ట్ చేసినట్లు ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. వర్షంలో ఇబ్బందులు, సమస్యలు సహాయక చర్యలకు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన 040-2111 1111 నంబర్‌కు డయల్ చేయాలన్నారు. డీఆర్ఎఫ్ బుద్ధభవన్‌లో హెల్ప్‌లైన్ కంట్రోల్ రూం మొబైల్ నంబరు 9000113667 కు సమాచారం ఇవ్వాలని డైరెక్టర్ కోరారు.
44 ఫిర్యాదులు పరిష్కారం
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ సిబ్బందితో వెనువెంటనే సమస్యలకు పరిష్కారం చూపుతున్నది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం వరకు పలువురు జీహెచ్ఎంసీ గ్రీవెన్స్‌సెల్‌కు ఫిర్యాదులు చేశారు. రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు 44 ప్రాంతాల్లోని ఫిర్యాదులను పరిష్కరించారు. 27 చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడగా.., ఒక చోట అగ్ని ప్రమాదం, 12 చోట్ల వరద నీరు నిలువగా.. అక్కడ నిలిచిన నీటిని క్లియర్ చేశారు. ఒక చోట ఎలక్ట్రిల్ పోల్, మూడు చోట్ల గోడలు కూలినట్లు అధికారులు తెలిపారు. పౌరులు అందించే ఫిర్యాదుల పరిష్కారంలో డీఆర్ఎఫ్ అప్రమత్తంగా ఉండి చర్యలు చేపడుతుందని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి తెలిపారు.
ఎల్బీనగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గం గడ్డిఅన్నారం, లింగోజిగూడ డివిజన్లలోని ముంపు ప్రాంతాలను, వరదనీటి కాలువ నిర్మాణాలను, సరూర్‌నగర్, బైరామల్‌గూడ చెరువులను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్తో కలిసి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి బుధవారం ఉదయం పరిశీలించారు. వారితోపాటు జోనల్ కమిషనర్ పంకజ, ఉప కమిషనర్లు అరుణకుమారి, రవీందర్, తదితరులు ఉన్నారు.