మేడ్చల్, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడుల్లో ఆహార కమిటీల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాలయాల్లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురువుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. మధ్యాహ్న భోజనాన్ని విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చేసుకుంటున్నా.. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేలా దృష్టి సారించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ప్రభుత్వ బడుల్లో ఆహార కమిటీలను ఇప్పటివరకు 50 శాతం బడులకు మాత్రమే ఏర్పాటు చేయగా, మిగతా 50 శాతం స్కూళ్లలో ఆహార కమిటీలను ఎప్పుడు పూర్తి చేస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఆహార కమిటీల ఏర్పాటులో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా విద్యాశాఖ నిర్లక్ష్యం వహిస్తున్నది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో 505 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఇందులో 88,600 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆహార కమిటీలో ప్రధానోపాధ్యాయుడితో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు, కొంత మంది విద్యార్థులు ఉండనుండగా, ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం వండే ముందు పాత్రలు శుభ్రంగా ఉన్నాయా.. వంట సరకులు నాణ్యమైనవి ఉండేలా చూస్తారు. వంట సరకులు నాణ్యమైనవిగా లేకుంటే తిరస్కరిస్తారు.
అన్ని సరిగా ఉంటేనే వంటను ప్రారంభించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వండిన వంటను భోజనానికి ముందు రుచి, నాణ్యతను కమిటీ సభ్యులు చూసిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాల్సి ఉంటుంది. ఆహార కమిటీల విషయంలో చర్యలు తీసుకుంటామని జిల్లాలోని విద్యాశాఖ అధికారులు చెబుతున్నప్పటికీ కమిటీల ఏర్పాటులో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలుస్తున్నది.