గోల్నాక : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహిళల సంక్షేమం, భద్రత, సాధికారత విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురుస్కరించుకొని రాష్ట్రంలో మూడు రోజుల పాటు ‘కేసీఆర్ మహిళా బంధు’ పేరిట వేడుకలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆదివారం అంబర్‌పేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రేమ్‌నగర్ గ్రీన్లాండ్ చౌరస్తా వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ వేడుకలకు స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలసి హాజరైన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పలువురు మహిళా పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. సంబురాల్లో భాగంగా మహిళా సంక్షేమానికి నిరంతంరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ చిత్రపటానికి మహిళలు రాఖీలు కట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల ఆరోగ్యాలను కాపాడడంతో పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్ల పాత్ర మరవలేనిదన్నారు. సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, ఆయనకు మనమంతా నిరంతరం అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.