చిన్నారుల కేరింతలు..యువతుల ముచ్చట్లు..దంపతుల సెల్ఫీలు..కుర్రాళ్ల చిందులతో ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్ ప్రధాన మార్గం మురిసిపోయింది. ఓ నెటిజన్ విన్నపం మేరకు మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై పర్యాటకుల విహారం రణగొణ ధ్వనులు లేకుండా సాగింది.
జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివచ్చిన సందర్శకులు సాగర్ అందాలను వీక్షించి మైమరిచిపోయారు. మిరుమిట్లు గొలిపే కాంతుల్లో ధగధగలాడిన తథాగతుడి (గౌతమ బుద్ధుడు)ని
తమ కెమెరాల్లో బంధించారు. సాధారణంగా ట్యాంక్‌బండ్‌పై ప్రతియేటా గణేశ్ నిమజ్జనం నాడే ట్రాఫిక్‌ను నిలిపివేస్తారు. ఇక నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ నిలిపివేసి కేవలం పర్యాటకులను మాత్రమే అనుమతిస్తారు. నగర సీపీ అంజనీకుమార్, జాయింట్ సీపీ విశ్వప్రసాద్, ట్రాఫిక్ డీసీపీ చౌహాన్లు కాలినడకన కలియ తిరిగి సందర్శకులతో ముచ్చటించారు. కాగా తొలివారం 15 నుంచి 20 వేల మంది సందర్శకులు వచ్చినట్లు అధికారుల అంచనా.
ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. పేరెంట్స్‌తో కలిసి ప్రతినెలా వస్తాను. ఎప్పుడూ ట్రాఫిక్ ఉండేది. జాగ్రత్తలు చెప్పేవారు. ఇప్పుడు నన్ను, తమ్ముడిని ఫ్రీగా వదిలేశారు. ట్యాంక్‌బండ్ మొత్తం తిరుగుతున్నా. మినిస్టర్ కేటీఆర్ సార్ నిర్ణయం సూపర్. -తేజస్ జైన్, బర్కత్‌పురా
మాది జనగామ జిల్లా పాలకుర్తి మండలం. 20 ఏండ్ల క్రితం కుటుంబంతో హైదరాబాద్‌కు వచ్చిన. రోజూ ట్యాంక్‌బండ్‌పై మరమరాల చుడువా అమ్ముతా. పొద్దట్నుంచి రాత్రి వరకు అమ్మితే కూలీ గిట్టుబాటవుతుంది. ఆదివారాల్లో ట్రాఫిక్ ఎక్కువ ఉండటంతో వ్యాపారం సరిగ్గా సాగేది కాదు. ఇప్పుడు ట్రాఫిక్ లేదు. సందర్శకులు నడుచుకుంటూ వచ్చి చుడువా కొంటున్నారు.
రణగొణధ్వనులు లేవు.. వాహనాల రాకపోకలు లేవు.. చల్లని సాయంకాలం.. ఓ వైపు చిరుగాలులు మనసును హత్తుకునేలా వీస్తుంటే.. మరోవైపు సాగర్ కెరటాలు నాట్యమాడుతున్నట్లు ఎగిసిపడుతుంటే.. అలల సవ్వడి మధ్య ఏర్పాటు చేసిన బుద్ధుడి ఏకశిలా ప్రతిమ..దాని చుట్టూ ఉన్న లైటింగ్ అందాలు.. వెరసి ట్యాంక్‌బండ్ చూడముచ్చటగా దర్శనమిచ్చింది. హైదరాబాద్ నడిబొడ్డున గల హుస్సేన్ సాగర్ తీరం ఆదివారం ఆహ్లాదానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సడలింపులతో ట్యాంక్‌బండ్ సాయంత్రం 5 నుంచి రాత్రి పది గంటల వరకు పూర్తిగా టూరిస్టులమయంగా మారింది. సుమారు 20 వేల మంది ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చి ఆహ్లాదంగా గడిపారు. పిల్లాజెల్లా అంతా కలిసి తనివీతీరా సాగర్ అందాలను తిలకించారు. సాగర్ జలాలపై రయ్య్‌మ్రంటూ షికారు చేశారు. మొత్తంగా ప్రశాంత వాతావరణంలో సాగర్ అందాలను సందర్శకులు తనివితీరా చూసి తన్మయత్వం చెందారు.
ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్ సెల్ఫీలకు కేంద్రంగా మారింది. సకుటుంబ సమేతంగా నగరవాసులు సాగర పరిసరాల్లో ఆడిపాడుతూ వీడియోలు తీసుకున్నారు. అంతేకాక ట్యాంక్‌బండ్‌పై ఉన్న విగ్రహాల వద్ద నిల్చొని ఫొటోలు దిగారు. కొంతమంది కాలేజీ విద్యార్థులు షార్ట్ ఫిల్మ్‌లు షూట్ చేశారు. ఇంతటి అదృష్టం వస్తుందని అనుకోలేదని ‘నమస్తే తెలంగాణ’తో అన్నారు. థ్యాంక్స్ టూ కేటీఆర్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
ఐస్క్రీంల నుంచి పాప్‌కార్న్ వరకు ఫుడ్ అంతా ట్యాంక్‌బండ్ పరిసరాల్లోనే అందుబాటులో ఉండటంతో సందర్శకులు ఇష్టంగా ఆరగించారు. కాల్చిన, ఉడికించిన మక్క కంకులూ తింటూ సరదాగా గడిపారు. సుమారు 30 మంది చిరు వ్యాపారులు తమ ఉత్పత్తులను విక్రయించారు. చిన్నారులు తమకిష్టమైన బెలూన్లను గాల్లోకి ఎగరవేశారు.
ప్రతిఒక్కరూ మాస్క్ ధరించి కొవిడ్ జాగ్రత్తలు తీసుకున్నారు. శానిటైజర్ వెంట తెచ్చుకున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ట్యాంక్‌బండ్‌కు వచ్చి సేద తీరారు. వీకెండ్ వచ్చిందంటే చాలు నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలు సందర్శకుల తాకిడితో సందడిగా మారుతాయి. ముఖ్యంగా సాయంత్రం పూట ట్యాంక్‌బండ్‌పై గడిపేందుకు ఇష్టపడని వారంటూ ఉండరు. కుటుంబ సమేతంగా కొందరు.. స్నేహితులతో కలిసి మరికొందరు చేసే సందడి అంతాఇంతా కాదు. అయితే ట్రాఫిక్ రద్దీతో పర్యాటకులకు అనేక ఇబ్బందులు తలెత్తడంతో ఇది గమనించిన ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి సంవత్సరం గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ నిలిపేసినట్టు ప్రతి ఆదివారం సాయంత్రం కూడా పూర్తిగా ట్యాంక్‌బండ్‌పై వాహనాల రాకపోకలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నగర పోలీసులకు ప్రత్యేకంగా సూచన చేయడంతో నగర పోలీసులు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు.
వారాంతంలో ట్యాంక్‌బండ్ అందాలను వీక్షించేందుకు ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని ఓ నెట్‌జన్ ట్విట్టర్లో మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేయగా వెంటనే ఆయన స్పందించారు. ప్రతి ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లించాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ను ఆదేశించారు. దీంతో సీపీ సెంట్రల్ జోన్ జాయింట్ సీపీ విశ్వప్రసాద్, ట్రాఫిక్ డీసీపీ ఎల్ఎస్ చౌహాన్‌కు ట్యాంక్‌బండ్‌పై చేయాల్సిన ఏర్పాట్ల బాధ్యతలను అప్పగించారు. వెంటనే ఈ ఇద్దరు అధికారులు ట్యాంక్‌బండ్‌పై క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. సందర్శకుల అనుమతి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై చేపట్టాల్సిన ఏర్పాట్లపై నివేదిక అందజేశారు. దీంతో ప్రతి ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై వాహనాల రాకపోకలను నిషేధించారు.
హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న తీర ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. కేవలం ట్యాంక్‌బండ్ సుందరీకరణ కోసం సుమారు రూ.27 కోట్లు వెచ్చించింది. బండ్‌పై ఇరువైపులా వాకర్స్, పర్యాటకులను ఆకట్టుకునేలా ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో అధునాతన టాయిలెట్లు, విద్యుత్ దీపాలను అమర్చారు.
హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ తీరం వీకెండ్ సందడికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. శని, ఆదివారాల్లో హుస్సేన్‌సాగర్ తీరంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు నగరవాసులు లక్షలాదిగా తరలివస్తారు. ప్రధాన ఆకర్షణగా ఉండే ట్యాంక్ బండ్‌తో పాటు లుంబినీ పార్కు, బోటింగ్, ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్ రోడ్డు, జలవిహార్, సంజీవయయ్య పార్కులో సేద తీరుతారు. ఇక ప్రతి ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ లేకుండా ప్రభుత్వం చేయడంతో పర్యాటకుల సందడి పెరగనున్నది. అంతేకాక పర్యాటకంగా హాట్‌స్పాట్‌గా మారనున్నది.
ట్యాంక్‌బండ్ సందర్శకులకు ఇబ్బందులు కలగకుండా బస్సులను మళ్లించాం. ఆదివారం సాయంకాలం ఐదు నుంచి రాత్రి పది వరకు ట్యాంక్‌బండ్ వైపు వెళ్లవద్దని డ్రైవర్లకు సూచించాం. ఉన్నతాధికారుల సూచన మేరకు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూశాం. కొత్త డ్రైవర్లకు మార్చిన రూట్లపై అవగాహన కల్పించాం. -శ్రీనివాస్, కంట్రోలర్, రాణిగంజ్ డిపో
చుడీబజార్ తరహాలో సాగర తీరం వెంట నైట్ బజార్‌ను ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. మొత్తం 150 నుంచి 200 వరకు షాపులు ఏర్పాటు చేసి అందులో మహిళలు, చిన్నారులు సంబంధించిన అన్ని వస్తువులను ప్రదర్శనకు పెట్టనున్నారు. సంజీవయ్య పార్కు నుంచి బుద్ధభవన్ వరకు నడుచుకుంటూ (బోర్డు వాక్) షాపింగ్ చేసుకునే వీలు కల్పించనున్నారు. అర్ధరాత్రి వరకు ఈ నైట్ బజార్ అందుబాటులో ఉండనుంది. అంతేకాక ఫుడ్ కోర్టులు, ఆధునిక లైటింగ్, సిట్టింగ్, వుడ్ ప్లాస్టిక్ కంపోజిట్(డబ్ల్యూపీసీ) డెక్ ఏర్పాటు చేయనున్నారు. రూ.15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు అధికారులు టెండర్లు ఆహ్వానించారు.
ట్యాంక్‌బండ్‌పైకి వచ్చే సందర్శకుల కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ విగ్రహం నుంచి వచ్చే వారికి లేపాక్షి.. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే వారికి చిల్డ్రన్ పార్కు వరకు పార్కింగ్ స్థలాలను కేటాయించారు. ఈ రెండు మార్గాల్లో వచ్చే వాహనాలను క్రమబద్ధీకరించారు. చిక్కడపల్లి పోలీసులతో పాటు మౌంటెడ్, టీఎస్పీఎస్, ఆర్ముడ్ రిజర్వ్, క్రైం, లేక్, షీ టీమ్స్ బందోబస్తులో పాల్గొన్నాయి. లేక్ పోలీసులు నాలుగు పికెట్లు, ఒక బ్లూకోల్ట్స్‌తో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ట్యాంక్‌బండ్ పరిసరాలను ఆదివారం సాయంత్రం జాయింట్ సీపీ విశ్వప్రసాద్, ట్రాఫిక్ డీసీపీ చౌహాన్‌లతో కలిసి సీపీ అంజనీకుమార్ పరిశీలించారు. కాలినడక కలియ తిరిగారు. ఏర్పాట్లను పరిశీలించి పర్యాటకులను పలుకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం వందల కోట్లను ఖర్చు చేయడం అభినందనీయమన్నారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే సత్తా ఉందన్నారు. ట్యాంక్‌బండ్ పరిసరాలు ఎంతో బాగున్నాయని.. ఇక్కడ యూరప్ తరహా వాతావరణం ఉందని సీపీ అంజనీకుమార్ అన్నారు.
మేము మూసాపేటలో ఉంటాం. సాగర్ అందాలను చూసేందుకు ట్యాంక్‌బండ్ వద్దకు ఎప్పుడు వచ్చినా ట్రాఫిక్ ఇబ్బందులు ఉండేవి. చిన్నపిల్లలను తీసుకురావాలంటే భయమేసేది. ఇప్పుడా సమస్య లేదు. చాలా రిలాక్స్‌గా ఉంది. ఇక్కడ వాతావరణం ఆహ్లాదంగా ఉంది. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. – మనోజ్ఞ, శ్రీకాంత్ దంపతులు
మాది కామారెడ్డి. నేను 8వ తరగతి చదువుతున్నాను. హైదరాబాద్‌లో మా బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉంటే వచ్చాను. ఎప్పుడో చిన్నప్పుడు తీసుకువచ్చామని మా పేరెంట్స్ చెప్పారు. పెద్దయ్యాక ట్యాంక్‌బండ్‌ను చూడటం ఇదే మొదటి సారి. చాలా ఆనందంగా ఉంది. పరిసరాలు, సాగర్‌లోని వాటర్, బోట్లు ఎంతో బాగున్నాయి. – సహస్ర, కామారెడ్డి
లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద ఎంఎన్నగర్లో మా నివాసం. ఊహ తెలిసినప్పటి నుంచి ట్యాంక్‌బండ్‌కు వస్తున్నా. అప్పటికీ ఇప్పటికీ సాగర్ పరిసరాలు ఎంతో అభివృద్ధి చెందాయి. ట్రాఫిక్‌ను మళ్లించడం మంచి నిర్ణయం. మంచినీరు, మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలి. అంతేకాక నీటిలో పడిపోతే రక్షించేందుకు గజ ఈతగాళ్లను పెట్టాలి. – బి.నర్సింహ, విశ్రాంత సూపర్వైజర్
భార్య పిల్లలతో కలిసి ఇక్కడే ఎల్ఈడీ బెలూన్లు అమ్ముతుంటా. ఒక బెలూను రూ.100 నుంచి రూ.120 వరకు అమ్ముతా. అయితే కొనే వారు తక్కువే. రోజుకూ ఐదు నుంచి ఆరు మాత్రమే అమ్ముడుపోయేవి. ఆదివారం జనం బాగా రావడంతో గిరాకీ పెరిగింది. – రాము, ఎల్ఈడీ బెలూన్ల
ట్యాంక్‌బండ్‌ను ట్రాఫిక్ ఫ్రీ జోన్‌గా ప్రకటించి పర్యాటకులను అనుమతించడం మంచినిర్ణయం. ప్రభుత్వం సాగర తీరాలను అద్భుతంగా తీర్చిదిద్దింది. సాయంకాలం సాగర్‌ను చూడటం ఆనందంగా ఉంది. -దీప్తి, దోమలగూడ