Hyderabad | చింతపండు వ్యాపారం.. రూ.150 కోట్ల మోసం
వ్యాపార అవసరాల పేరుతో రైతులు, వ్యాపారుల నుంచి సుమారు రూ.150 కోట్లు వసూలు చేసిన చింతపండు వ్యాపారి (కమీషన్ ఏజెంట్) పరారయ్యాడు. కమీషన్ ఏజెంట్ చేసిన మోసంతో ఆవేదనకు గురైన ఓ వ్యాపారి బెంగతో మృతి చెందాడు.
- వ్యాపారులు, రైతులను మోసం చేసిన చింతపండు వ్యాపారి
- బినామీ పేర్లతో ఆస్తుల కొనుగోలు
- ఫిర్యాదు స్వీకరించని సరూర్‌నగర్, చాదర్‌ఘాట్ పోలీసులు
- బెంగతో ఓ వ్యాపారి మృతి, మంచం పట్టిన పలువురు
- ప్రభుత్వం, పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకోవాలని బాధితుల వేడుకోలు
Hyderabad | మలక్‌పేట, జూలై 26: వ్యాపార అవసరాల పేరుతో రైతులు, వ్యాపారుల నుంచి సుమారు రూ.150 కోట్లు వసూలు చేసిన చింతపండు వ్యాపారి (కమీషన్ ఏజెంట్) పరారయ్యాడు. కమీషన్ ఏజెంట్ చేసిన మోసంతో ఆవేదనకు గురైన ఓ వ్యాపారి బెంగతో మృతి చెందాడు. చాలా మంది బాధితులు మంచం పట్టారు. న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసుల వద్దకు వెళితే పట్టించుకోవడంలేదు.
ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసు శాఖ పట్టించుకొని న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. ఈ ఘటన మలక్‌పేటలోని శ్రీకృపా మార్కెట్ (గంజ్)లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం మలక్‌పేట మార్కెట్లోని తెలంగాణ చాంబర్ ఆఫ్ అగ్రి ట్రేడర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు దేవత అశోక్, దేవర రాజేశ్వర్, ఎస్.వేణు, శ్రీకాంత్, రాధాకృష్ణ, కట్టా మల్లేశ్, నర్సింహారావు, తెలంగాణ చాంబర్ ఆఫ్ అగ్రి ట్రేడర్స్ అధ్యక్షుడు చేగూరి వెంకటరమణ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
నమ్మించి మోసం చేశాడు..
మలక్‌పేటలోని శ్రీకృపా మార్కెట్లో ఉన్న షాపు నంబర్ 117లో గత 25 ఏండ్లుగా కాలేరు శ్రీనివాస్ లక్ష్మీప్రసన్న ట్రేడింగ్ కంపెనీ, సాయిరాం ట్రేడర్స్ పేరుతో చింతపండు వ్యాపారం (కమీషన్ ఏజెంట్‌గా) చేస్తున్నాడు. మార్కెట్లో అతడు చింతపండు కమీషన్ ఏజెంట్‌గా పెద్ద పేరు తెచ్చుకున్నాడు. అయితే, వ్యాపార అవసరాల పేరుతో కొంతకాలంగా అతడు పలువురు వ్యాపారులు, రైతుల నుంచి రూ.లక్షల్లో, కోట్లల్లో డబ్బులు తీసుకొని, తిరిగి వాయిదాల ప్రకారం చెల్లించాడు. దీంతో కాలేరు శ్రీనివాస్‌పై చాలా మంది వ్యాపారులకు నమ్మకం కుదిరింది. దీంతో అతడు మార్కెట్లోని దాదాపు 150 మంది వ్యాపారులు, రైతుల వద్ద.. ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల మొదలు రూ.5 కోట్ల వరకు డబ్బులు తీసుకున్నాడు. ఈ డబ్బుకు ష్యూరిటీగా కొందరికి ప్రామిసరి నోట్లు, మరి కొందరికి చెక్కులు కూడా ఇచ్చాడు.
తీసుకున్న డబ్బుతో ఆస్తుల కొనుగోలు..
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ గ్రామ పరిధిలో వజ్ర కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ లిమిటెడ్, మాతృశ్రీ కోల్డ్ స్టోరేజ్ పేర్లతో రెండు కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేసి, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన 50 మంది రైతుల వద్ద వ్యాపార అవసరాల పేరుతో డబ్బులు తీసుకున్నాడు. అదేవిధంగా.. వారివద్ద నుంచి కోనుగోలు చేసిన సరుకుతో పాటు, కొనుగోలు చేయని (గిట్టుబాటు ధర లభించక అమ్ముడుపోని) సరుకును తన కోల్డ్ స్టేరేజీల్లో నిల్వ చేయించుకున్నాడు.
రైతుల నుంచి కొనుగోలు చేసిన సరుకుకు డబ్బులు చెల్లించకుండా, నిల్వ చేసిన సరుకును రైతులకు తెలియకుండా విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. మార్కెట్లోని సుమారు 150 మంది వ్యాపారులు, 50 మంది రైతుల వద్ద నుంచి ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద పెద్ద మొత్తంలో (రూ.కోట్లల్లో) డబ్బులు తీసుకున్నాడు. బినామీ పేర్లతో తన తోడల్లుడు ధాత్రిక వెంకటేశ్‌తో కలిసి ఆస్తులు కొనుగోలు చేశాడని, ఈ తతంగంలో ప్రధాన సూత్రధారుడు ధాత్రిక వెంకటేశ్ అని బాధితులు తెలిపారు.
మనస్తాపానికి గురైన వ్యాపారి మృతి
దాదాపు 200 మంది నుంచి సుమారు రూ.150 కోట్లు తీసుకొని, ఎవరికీ తెలియకుండా మార్కెట్లోని మూడంతస్తుల వ్యాపార భవనాన్ని, కోహెడలోని రెండు కోల్డ్ స్టోరేజీలను విక్రయించి బిచాణా ఎత్తేశాడు. విషయాన్ని తెలుసుకున్న పలువురు బాధితులు, రైతులు ఇంటి చిరునామా తెలుసుకొని వెళ్లి ప్రశ్నించగా.. భార్యా, పిల్లలపై ఒట్టేసి.. ఎవరి డబ్బులు వారికి ఇస్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత 84 మందికి సంబంధించిన రూ.40 కోట్లకు ఐపీ పెట్టాడని, విషయాన్ని తెలుసుకున్న పలువురు వ్యాపారులు, సీనియర్ సిటిజన్లు బెంగతో మంచాన పడగా, ఓ వ్యాపారి బెంగతో చనిపోయాడని బాధితుడు కట్టా మల్లేశం కంటతడి పెడుతూ తెలిపారు.
ఫిర్యాదు స్వీకరించని పోలీసులు..
ఈ విషయమై చాదర్‌ఘాట్, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వివాదం కోర్టులో ఉందని, సీసీఎస్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటూ చాదర్‌ఘాట్ పోలీసులు చెప్పినట్టు బాధితులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసు శాఖ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, నిందితుడు కాలేరు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని ఆస్తులను జప్తుచేసి తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్‌కు సరూర్‌నగర్‌లో రూ.4 కోట్ల విలువజేసే ఇల్లు ఉన్నదని, మలక్‌పేట గంజ్‌లో ఓ భవనం, కోహెడలో రెండు ప్లాట్లు, పాత మలక్‌పేట డివిజన్లో ఇల్లు ఉన్నదని బాధితులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ చాంబర్ ఆఫ్ అగ్రి ట్రేడర్స్ అధ్యక్షుడు చేగూరి వెంకటరమణ, బాధితులు వి.సురేశ్, సి.సుధీర్, కె.శంకర్రావు, జితేంద్ర, ఎన్.శ్రావణ్‌కుమార్, కె.శ్రీనివాస్, ఎం.పాపారావు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

