కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 27 : యేడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు వేసవి సెలవుల్లో ఆటలాడుకునేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. చిన్నారుల్లో అంతర్గతంగా దాగిఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రతియేటా వేసవి శిక్షణా తరగతులు ఆనవాయితీగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా కరోనా ప్రభావంతో వేసవి శిక్షణా తరగతులను నిర్వహించడంలో కాస్త ఇబ్బందులు ఎదురైన ఈ యేడాది అన్ని రకాల క్రీడలకు శిక్షణా శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాలనీలు, బస్తీలలో జీహెచ్ఎంసీ క్రీడా ప్రాంగణాలలో నామమాత్రపు ఫీజులతో ఆయా క్రీడలలో నైపుణ్యాలను సాధించవచ్చు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో వేసవి శిక్షా శిబరాలు ప్రారంభం కాగా కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో నేటినుంచి శిక్షణా శిబిరాలు ప్రారంభం కానున్నాయి.
38 క్రీడాంశాలు.. 85 కేంద్రాలు..
కూకట్పల్లి జోన్ పరిధిలో మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్ సర్కిళ్లు ఉన్నాయి. ఈ యేడాది వేసవి శిక్షణా తరగతులు నేటినుంచి లాంఛనంగా ప్రారంభమై నెలరోజుల పాటు జరుగనున్నాయి. జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్ల వారీగా క్రీడా అంశాలు, శిక్షణ అందించడానికి గ్రౌండ్స్ (సెంటర్లు)లను గుర్తించారు. జోన్లో 38 క్రీడా అంశాలలో 85 క్రీడా ప్రాంగణాలలో వేసవి శిక్షణా తరగతులు కొనసాగుతాయి. ఆయా క్రీడా అంశాలలో శిక్షణ పొందిన కోచ్‌ల పర్యవేక్షణలో దరఖాస్తు చేసుకున్న చిన్నారులకు శిక్షణ ఇవ్వనున్నారు. వచ్చేనెల 29 వరకు నిర్విరామంగా శిక్షణా తరగతులు కొనసాగుతాయి.
ఆన్లైన్లోనే దరఖాస్తులు..
వేసవి శిక్షణా శిబిరాల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. సర్కిల్ పరిధిలో ఎంపిక చేసిన క్రీడా ప్రాంగణాల వివరాలు, కోచ్‌ల వివరాలు ఆన్లైన్లో పొందుపర్చారు. క్రీడాకారులకు అందించే క్రీడా సామగ్రిని సైతం ఆన్లైన్ దరఖాస్తులతోనే అందించనున్నారు. విద్యార్థులు వేసవి శిక్షణా తరగతుల్లో పాల్గొనాలంటే ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది సమ్మర్ క్యాంప్‌లో పాల్గొనాలనుకునే విద్యార్థులు ఆన్లైన్లో పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుం ది. పారదర్శకంగా శిక్షణా శిబిరాలు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.
సమ్మర్ క్యాంపులో క్రీడాంశాలు..
వేసవి శిక్షణా శిబిరాల్లో బాల్ బాడ్మింటన్, బాస్కెట్‌బాల్, కారాటే, బాక్సింగ్, క్యారమ్స్, క్రికెట్, చెస్, రోలర్ స్కేటింగ్, షెటిల్ బ్యాడ్మింటన్, ఫుడ్‌బాల్, టెన్నిస్, కోకో, యోగా, టెన్నీకాయిట్, థైకొండొ, కబడ్డీ, వాలీబాల్ క్రీడలలో శిక్షణ ఇవ్వనున్నారు. నైపుణ్యం కలిగిన కోచ్‌ల పర్యవేక్షణలో ఎంచుకున్న క్రీడా అంశాలలో నైపుణ్యాలు, మెలకువలు, సూచలను అందిస్తారు. వేసవి శిక్షణా శిబిరాలలో 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొనేందుకు అర్హులు. ప్రతి రోజు ఉదయం 6గం.ల నుంచి 8గం.ల సమయంలో విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తారు.
సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో వేసవి శిక్షణా తరగతులు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. చందానగర్ పీజేఆర్ స్టేడియంలో నేడు సమ్మర్ క్యాంపును లాంఛనంగా ప్రారంభంకానుంది. సర్కిళ్ల వారీగా వివిధ క్రీడలు, క్రీడా ప్రాంగణాలను గుర్తించడం జరిగింది. వేసవి శిక్షణా తరగతుల్లో పాల్గొనాలనుకునే విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. నైపుణ్యం కలిగిన కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణా తరగతులు ఉంటాయి. విద్యార్థులు శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.
– వి.మమత, జడ్సీ, కూకట్పల్లి జోన్