సిటీ బ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): వీధి వ్యాపారులు, చిన్న చిన్న దుకాణాలు నిర్వహిస్తూ కుటుంబాలను పోషించుకునే చిరు వ్యాపారుల పాలిట క్విక్ కామర్స్ డెలివరీ సంస్థలు, షాపింగ్ మాల్స్ , సూపర్ మార్కెట్లు శాపంగా మారుతున్నాయి. ఆన్లైన్ డెలివరీలు, డిస్కౌంట్లతో మాల్స్, క్విక్ కామర్స్ సంస్థలు చూపే ఆశలతో కొనుగోళ్లు తగ్గిపోయి రోడ్ల వెంట, కాలనీల్లోని ఉండే పండ్లు, కూరగాయలు, కిరాణా దుకాణాలు వెలవెలబోతున్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న క్విక్ కామర్స్ యాప్‌లు, సూపర్ మార్కెట్లు చిరు వ్యాపారులకు ఉపాధి లేకుండా చేస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలో చిరు వ్యాపారాల మీదనే ఆధారపడి జీవించే వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అమ్మకాలు తగ్గడంతో కుటుంబ పోషణ భారంగా మారుతున్నదని వీధి వ్యాపారులు, చిన్న చిన్న దుకాణాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన మూడేండ్లుగా దుకాణాల అద్దెలు కూడా చెల్లించలేని దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. నగరంలో కరోనా మహమ్మారి సృష్టించిన అలజడికి ఇంటి అద్దెలతో పాటు అన్ని వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి.
ఆన్లైన్ సేవలు విస్తృతం కావడంతో అన్నింట్లోకి క్విక్ కామర్స్ సంస్థల డెలివరీ విధానం వచ్చింది. దీంతో పండ్లు, కూరగాయలు, పాల ప్యాకెట్ల నుంచి మాంసం ఉత్పత్తుల దాకా అన్నీ ఆన్లైన్ బుకింగ్స్‌తో ఇంటి వద్దకే వచ్చేంతగా మారిపోయింది. దీని ప్రభావం వీధి వ్యాపారాలు, కిరాణా దుకాణాలపై తీవ్రంగా పడింది. చేసేదేమీ లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో నగరంలోని చాలా ప్రాంతాల్లోని రోడ్ల వెంట ఉన్న చిరు వ్యాపారులు, కాలనీల్లో ఉన్న చిన్న చిన్న దుకాణాలను మూసేస్తున్నారు.
ఆన్లైన్ క్విక్ కామర్స్ యాప్‌లు వచ్చిన తర్వాత ప్రజలు తోపుడు బండ్లు, రోడ్ల వెంట ఉండే చిన్నచిన్న పండ్లు, టిఫిన్ బండ్లు, కూరగాయల దుకాణాలు, కిరాణా షాపులు, వారంతపు సంతలకు వెళ్లడం పూర్తిగా తగ్గించేశారు. రద్దీగా ఉండే కాలనీల్లో ఏర్పాటు చేస్తున్న వారాంతపు సంతలు వెలవెలబోతున్నాయి. పండ్లు, కూరగాయలు, నిత్యావరసర సరకులను ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే ఇండ్లకు చేరుతుండటంతో ఆన్లైన్ విధానం వైపే మొగ్గు చూపుతున్నారు. తక్కువ సమయంలో ఇండ్లకు చేర్చడంతో పాటు ఆఫర్ల పేరిట దుకాణాల్లోని ధరల కంటే తక్కువకే ఇస్తున్నారు. బయట దొరికేదాని కంటే తక్కువకే ఇస్తుండటంతో ప్రజలు ఆన్లైన్లో ఆర్డర్ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు.
మరోవైపు తొలిసారి బుక్ చేసుకున్నవారికి క్యాష్ బ్యాక్, ప్రత్యేక ఆఫర్లను అందిస్తుండటంతో వినియోగదారులు క్విక్ కామర్స్ యాప్‌లకు ఆకర్షితులవుతున్నారు. ధరలు కూడా అందుబాటులో ఉండటం, సమయం ఆదా అవుతుండటంతో బయట కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదని వినియోగదారులు భావిస్తున్నారు. ఇదంతా చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. కొనుగోళ్లు, ఆదాయం గతం కంటే సగానికి పడిపోవడంతో ఉపాధి కోల్పోతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో పుట్టుకొస్తున్న మాల్‌లు, సూపర్ మార్కెట్లు కూడా కిరాణా దుకాణాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. సూపర్ మార్కెట్లలో నిత్యావసర సరకులు, కూరగాయలు, పండ్లు, ఇతర వస్తువులు తక్కువ ధరలకు లభిస్తాయనే భావనతో వినియోగదారులు నెలకు సరిపడా తీసుకునేందుకు వాటిపైనే ఆధారపడుతున్నారు. అదేవిధంగా కిరాణా, కూరగాయలు, పండ్లతో పాటు పాలు, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలన్నీ సూపర్ మార్కెట్లలో ఉండటంతో అన్ని వస్తువులు ఒకే దగ్గర, ఒకేసారి తీసుకోవచ్చని ప్రజలు వాటివైపు మొగ్గు చూపుతున్నారు.
సూపర్ మార్కెట్లలో ఒకేసారి అన్ని రకాల వస్తువులను తక్కువ ధరలకు కొనుగోలు చేయడంతో పాటు సమయం కూడా కలిసొస్తుందనే భావనతో కిరాణా దుకాణాలు, కూరగాయల దుకాణాలు, వారాంతపు సంతలకు వెళ్లడంలేదు. నగరంలో పెరుగుతున్న పాశ్చాత్య సంస్కృతికి పేద, మధ్య తరగతి ప్రజలు అలవాటు పడుతున్నారు. దీంతో మాల్స్, సూపర్ మార్కెట్లలో ఏర్పాటు చేసిన వసతులకు ఆకర్షితులవుతున్నారు. ఆఫర్లు, తక్కువ ధరలు ఉంటుండటం కూడా వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
ఆన్లైన్ ఆర్డర్లకు పెరుగుతున్న విపరీతమైన డిమాండ్‌ను క్విక్ కామర్స్ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. నాణ్యత లేని సరకులు, కూరగాయలను సరఫరా చేస్తూ వినియోగదారుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఇటీవల ముంబై నగరంలోని జెప్టో గోడౌన్ డంపింగ్ యార్డులా దర్శనమివ్వడమే దీనికి నిదర్శనం. బూజుపట్టిన ఆహార పదార్థాలు, కుళ్లిన కూరగాయలను ప్రజలకు సరఫరా చేస్తుండటాన్ని అక్కడి అధికారులు బట్టబయలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లోనూ పలు హోటళ్లు, మాల్స్ల్లో శుభ్రత లోపించి, కుళ్లిన మాంసం, ఆహారపదార్థాలు పట్టుబడుతున్నాయి.
వీటినే జెప్టో, బిగ్ బాస్కెట్, బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ సంస్థలు డెలివరీ చేస్తున్నాయి. ఆఫర్లు, డిస్కౌంట్ల పేరిట వినియోగదారులు కూడా అవేమీ పట్టించుకోవడం లేదు. ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా కొనుగోలు చేసిన ఆహార పదార్థాలు తిని రోగాల బారిన పడే ప్రమాదముంది. వీలైనంత వరకు ఆన్లైన్ డెలివరీలను నమ్ముకోకుండా దుకాణాల్లో నచ్చిన, నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోవడం మంచిదని నిపుణులు సైతం సూచిస్తున్నారు. దీంతో చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూత ఇవ్వడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనం సాగించవచ్చని అభిప్రాయపడుతున్నారు.
నేను నార్సింగిలో ఆరేండ్లుగా కూరగాయల దుకాణం నిర్వహిస్తున్నా. ఇటీవల ఆన్లైన్ డెలివరీ యాప్‌ల ప్రభావం నాలాంటి చిరు వ్యాపారులపై తీవ్రంగా పడింది. కూరగాయల అమ్మకాలు గతంతో పోలిస్తే 50 శాతం వరకు తగ్గాయి. కూరగాయలు కొనేందుకు కూలీ పనులు చేసుకునేవాళ్లు కూడా రావడం తగ్గించారు. ఆన్లైన్లో ఆర్డర్ చేయడం వల్ల తక్కువ ధరతో పాటు ఇంటి వద్దకే వస్తున్నాయని దుకాణాలు, వారాంతపు సంతలకు వెళ్లడం లేదు.
మార్కెట్ ధరల కంటే ఆన్లైన్ యాప్ వాళ్లు ఎలా తక్కువకు ఇస్తున్నారో అర్థం కావడంలేదు. మా ప్రాంతంలో భవన నిర్మాణాలు జరుగుతున్నాయి కాబట్టి కొంతవరకు ఇబ్బంది లేదు. కానీ నగరంలో ప్రధాన ప్రాంతాల్లో వీధి వ్యాపారులు, చిన్న చిన్న దుకాణాల వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అద్దెలు చెల్లించలేక వేరే పనుల్లో చేరుతున్నారు. – రాజు, కూరగాయల దుకాణాదారుడు, నార్సింగి