బంజారాహిల్స్, జూన్ 28: శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పాలకమండలి చైర్మన్ ఎన్నికను ఆఖరి నిమిషంలో వాయిదా వేయడానికి కారణం తాను బోనాల పండుగ కోసం కర్ణాటక నుంచి ఏనుగును తెచ్చేందుకు వెళ్లడమేనని ఆలయ ఈవో శ్రీనివాసశర్మ తెలిపారు. ఆలయ పాలకమండలి సమావేశాన్ని ఆఖరి నిమిషంలో వాయిదా వేయడం, చైర్మన్ ఎన్నిక కోసం సిద్ధమైన ఓ గ్రూపు సభ్యుల ఆగ్రహంతో శుక్రవారం గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. పాలకమండలి సభ్యుల్లో శ్రీనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి చైర్మన్ పదవి కోసం నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి ద్వారా పైరవీ చేస్తున్న వైనాన్ని కమిటీ సభ్యులు బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై నమస్తే తెలంగాణలో కథనం రావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.
పాలకమండలి సమావేశాన్ని వాయిదా వేస్తున్న విషయం గురించి ముందుగానే సభ్యులకు తెలియపర్చాల్సి ఉండేదని, అనుమానాలు కల్పించేలా ప్రవర్తించడం మంచిది కాదంటూ స్థానిక అధికారులపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కాగా జిల్లాకు సంబంధం లేని ఓ మంత్రి పాలకమండలి ట్రస్ట్ చైర్మన్ అంశంలో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు అధికారపార్టీ నేతల్లో సైతం చర్చనీయాంశం అయ్యాయి. ఈ మొత్తం వ్యవహారం మరింత బయటకు వస్తే ఇబ్బందులు తప్పవని భావించిన దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో శనివారం ఆలయ ఈవో శ్రీనివాసశర్మ ఓ పత్రికా ప్రకటన జారీ చేశారు. త్వరలో నగరంలో జరగనున్న బోనాల వేడుకల్లో పాల్గొనేందుకు కర్ణాటక నుంచి శిక్షణ పొందిన ఏనుగును తీసుకురావాల్సి ఉండగా ఆ పనిమీద తాను వెళ్లానని, అనుకోకుండా పడిన పని కారణంగానే పాలకమండలి చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. త్వరలోనే సమావేశాన్ని నిర్వహించి పాలకమండలి ట్రస్ట్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తిచేస్తామని పేర్కొన్నారు.