సిటీబ్యూరో, మే 20, (నమస్తే తెలంగాణ) : ఎట్టకేలకు శిథిల భవనాలపై బల్దియా దృష్టిపెట్టింది. శిథిల భవనాల విషయంలో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ ‘నమస్తే’లో 19న ప్రచురుతమైన కథనానికి స్పందించిన టౌన్‌ప్లానింగ్ అధికారులు.. ప్రమాదకర భవనాలను గుర్తించి , సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేసేందుకు సర్కిళ్ల వారీగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రెండు రోజుల్లో 30 సర్కిళ్లలో కూలేందుకు సిద్ధంగా ఉన్న పురాతన భవనాలకు సంబంధించి నివేదికను కమిషనర్‌కు అందజేయనున్నారు.
వానకాల విపత్తుల నివారణలో భాగంగా శిథిల భవనాలను గుర్తించడం, పురాతన భవనాల పటిష్టత , భద్రతపై ఇంజినీరింగ్ విభాగాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం, అత్యంత ప్రమాదకరమైన భవనాలను కూల్చివేసేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు సర్వే జరుపుతున్నారు. శిథిల, ప్రమాదకరమైన భవనాల్లో ఉన్న నివాసితులను గుర్తించి.. వారిని అక్కడిని నుంచి ఖాళీ చేయడానికి చర్యలు చేపట్టనున్నారు. వచ్చే నెల మొదటి వారంలో వర్షాకాలం మొదలవ్వనున్న నేపథ్యంలో పాత భవనాల రూపంలో ముప్పు రాకుండా భవన యజమానులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న భవనాలను ఇప్పటికే గుర్తించిన అధికారులు.. నోటీసులు జారీ చేస్తున్నారు.