సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో విలీనం కానున్న 27 పట్టణ స్థానిక సంస్థల్లో కొందరు అధికారులు ఇష్టారీతిలో ఎన్వోసీలు, ఇంటి అనుమతులు, పెండింగ్ బిల్లుల ఫైళ్లను చకచకా క్లియర్ చేస్తుండడంపై ‘పెండింగ్ ఫైళ్లకు రెక్కలు’ అనే శీర్షికతో ఈ నెల 2న ‘నమస్తే’లో వచ్చిన ప్రత్యేక కథనానికి బల్దియా అధికారులు స్పందించారు. ఒకో పట్టణ స్థానిక సంస్థలోని అధికారులకు రెండు రోజుల కిందట ఫోన్లు చేసి .. కేవలం జీతభత్యాల చెల్లింపు, చిన్న, చిన్న రొటీన్ మెయింటనెన్స్ ఖర్చులు మినహా ఆయా పనులకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపులు, చెకులు జారీ చేయడం వంటివి చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
నిబంధనలకు విరుద్ధంగా పట్టణ స్థానిక సంస్థలు కొత్త మంజూరీలిచ్చినా, బిల్లుల చెల్లింపులు జరిపినా విజిలెన్స్ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. బిల్లులు చెల్లించిన అధికారి ఎందుకు చెల్లించారన్న కోణంలో ఈ విజిలెన్స్ విచారణ ఉంటుందని కూడా సూచించినట్లు సమాచారం.