GHMC | సిటీబ్యూరో: పౌరుల సేవలకు కేటాయించిన ప్రభుత్వ వాహనాలను కొంతమంది అధికారులు తమ కుటుంబ సేవలకు వినియోగిస్తున్నారా? విధి నిర్వహణలో మాత్రమే వినియోగించాల్సిన వాహనాలను గ్రేటర్‌ను దాటించి ఇతర జిల్లాల్లోకి తమ సొంత అవసరాలకు వాడుతున్నారా? అంటే జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులపై కార్లపైన ఇటీవల వస్తున్న ట్రాఫిక్ చలాన్లు అవుననే సమాధానం ఇస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండాల్సిన వాహనాలు ఔటర్ దాటి ఇతర జిల్లాల్లో సైతం దర్శనమిస్తున్నాయి. సెలవు రోజుల్లోనే కాదు పని దినాల్లోనూ బయటి జిల్లాల్లో ఈ కార్లకు ఓవర్ స్పీడింగ్, రాంగ్ పార్కింగ్, సిగ్నల్స్ జంపింగ్ వంటి చలాన్లు వస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలోనే ఇష్టారీతిలో వాహనాల వినియోగం, లెక్కకు మించి డీజిల్ వినియోగం చేస్తూ బల్దయా ఖజానాకు భారీగా గండి పడుతున్నది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో డ్రైవర్ కం ఓనర్ పథకం కింద ఉన్న వాహనాలతో పాటు ప్రైవేట్ కార్లు దాదాపు 750 వరకు ఉన్నాయి. వీటికోసం బల్దియా ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నది. ముఖ్యంగా కొందరు అధికారుల తీరుతో ఖజానాకు నష్టం జరుగుతున్నది. అధికారిక కార్యక్రమాలు నిర్వహించడానికి..తనిఖీలకు, పరిశీలనకు సమకూర్చిన ప్రభుత్వ వాహనాలను సినిమాలు , షికార్లు, షాపింగ్‌లకు, కుటుంబ పర్యటనలకు, బంధువుల ఇంట కార్యాలకు, ఆఖరుకు కూరగాయలు తీసుకురావడం, ఇలా చిన్నా చితక పనులకు సైతం ఇవే వాహనాలను వినియోగిస్తుండటంతో ప్రజాధనం నీళ్ల ప్రాయంగా ఖర్చు అవుతున్నది.
జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ , కమిషనర్ వంటి వారికి సైతం ప్రతి నెల అప్పర్ లిమిట్ 1000 లీటర్ల డీజిల్ వాడుకునే అవకాశం ఉంది. అయితే మేయర్, డిప్యూటీ మేయర్ ఎక్కడికి తిరగకపోయినా ఫుల్ డీజిల్ కూపన్లు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న రోజుల్లో సైతం ఈ ప్రజాప్రతినిధులు 800 నుంచి 900 లీటర్ల డీజిల్ యూజ్ చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. కమిషనర్ జోక్యం చేసుకొని ఇంధనం పేరిట జరుగుతున్న దుబారాను అడ్డుకట్ట వేసి…పాత బిల్లులపై సమగ్ర విచారణ జరిపించాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
కార్పొరేషన్ కార్యక్రమాలు..తనిఖీలకు, పరిశీలనకు మాత్రమే సర్కారు వాహనాలను వినియోగించాలి. జీహెచ్ఎంసీలో కొందరు అధికారులు మాత్రం ఈ వాహనాలను విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. కొందరైతే సొంత వ్యవహారాలకు కూడా సర్కారు వాహన సేవలు ఉపయోగించుకుంటున్నారు. ఓ అధికారి తమ పిల్లలను పాఠశాలకు తీసుకువెళ్లి, తిరిగి తీసుకొచ్చేందుకు..మరొకరు సినిమాలు, షికార్లు, షాపింగ్‌లకు, కుటుంబ పర్యటనలకు, బంధువుల ఇంటి శుభకార్యాలకు, ఆఖరికి కూరగాయలు తీసుకురావడానికి సైతం ప్రభుత్వ వాహనాలను వినియోగిస్తున్న అధికారులు లేకపోలేదు.
జీహెచ్ఎంసీలో ఉన్నతాధికారులకు ఇన్నోవా కార్లు… డిప్యూటీ కమిషనర్లకు స్కార్పియో కార్లు, మెడికల్ ఆఫీసర్లు, జాయింట్ కమిషనర్లకు బొలెరో కార్లు ఉన్నాయి. వీటికి ఆయా విభాగాల అధికారులను బట్టి 200 నుంచి 280 లీటర్ల డీజిల్ ప్రతి నెల సమకూరుస్తారు. ఇందులో చాలా మంది ఇంటికి ఆఫీసుకు మాత్రమే కార్లను ఉపయోగిస్తున్నారు. అందుకు ప్రతి రోజు 30 నుంచి 50 కిలోమీటర్లు లోపు మాత్రమే తిరుగుతారు. కానీ 100 కిలోమీటర్ల దూరం తిరిగినట్లుగా డీజిల్ డ్రా చేసుకుంటున్నారు. అయితే తిరిగి కిలోమీటర్లను బట్టి కాకుండా ప్రతి నెల వీరికి 280 లీటర్ల డీజిల్ ఇస్తుండడంతో అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతున్నది.