సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ) : దేశంలో మొట్టమొదటిసారిగా ఔటర్ రింగు రోడ్డు వెంబడి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రెండు మార్గాల్లో 23 కి.మీ మేర నిర్మిస్తున్న పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆగస్టు 15న ప్రారంభించాలని లక్ష్యాన్ని పెట్టుకున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆ దిశగా పనులను వేగంగా పూర్తి చేస్తోంది. ఇప్పటివరకు ట్రాక్ నిర్మాణంతో పాటు సోలార్ రూఫ్ టాప్ కోసం స్టీల్ రాడ్స్ పైభాగం నిర్మాణం పూర్తి చేశారు. చివరి దానిపై సోలార్ ప్యానల్స్‌ను బిగించేందుకు షీట్స్‌ను బిగిస్తున్నారు.
ఈ పనులను నానక్‌రాంగూడ, నార్సింగి మధ్యలో ఉన్న మై హోం అవతార్ జంక్షన్ నుంచి చేపట్టామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. నిర్మాణం పనులను సివిల్ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో పాటు ఎలక్ట్రికల్ విభాగం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఐటీ కారిడార్‌లో ఔటర్ రింగు రోడ్డు వెంబడి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల నానక్‌రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో ఈ పనులపై ఉన్నతాధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. ఆగస్టు 15 నాటి కల్లా పూర్తి చేయాలని సూచించడంతో కాంట్రాక్టు సంస్థతో పాటు హెచ్ఎండీఏ అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రత్యేక బృందాలను నియమించి పనులు చేస్తున్నారు.
ఇప్పటికే సోలార్ ప్యానల్స్ బెంగుళూరు నుంచి ఓఆర్ఆర్ సైట్ వద్ద చేరుకున్నాయని అధికారులు తెలిపారు. నిర్ణీత గడువులోగా సోలార్ ప్యానల్స్‌ను బిగిస్తామని, అదే సమయంలో 16 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న సోలార్ విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసే పనులు సైతం మరోవైపు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. వట్టినాగులపల్లి, తెలంగాణ పోలీస్ అకాడమీ,కొల్లూరు ప్రాంతాల్లో ఉన్న సబ్ స్టేషన్లకు 10 మెగా వాట్లను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తుండగా, మిగిలిన విద్యుత్ నెట్ మీటరింగ్ ద్వారా ఓఆర్ఆర్ ప్రాజెక్టు అవసరాలకు వినియోగిస్తామని అధికారులు తెలిపారు.