హిమాయత్‌నగర్, అక్టోబర్22 : సామాజిక స్పృహ..ప్రజా సేవ చేయాలన్న తపన ఆ విద్యార్థిని ఆదర్శజీవనం వైపు నడిపిస్తున్నాయి. నగరంలోని మాదాపూర్‌కు చెందిన పడకంటి శ్రీనివాసరావు, అపర్ణ దంపతుల మొదటి కుమారుడు సుహ్రిత్ చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్(సీబీఎస్ఈ)లో 12వ తరగతి చదువుతున్నాడు. ఓ వైపు చదువుకుంటూనే చిన్నతనం నుంచే సామాజిక సేవకు శ్రీకారం చుట్టాడు. తన బంధు మిత్రులు, కుటుంబ సభ్యుల తోడ్పాటుతో అనాథ ఆశ్రమాలు, దేవాలయాల వద్ద అన్నదానం చేస్తున్నాడు.
కంటి వ్యాధులతో ఇబ్బందులు పడే పేదలకు ఆర్థిక సహాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకుంటున్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో జరిగే స్కూబా డైవింగ్, గిటార్, అబాకస్, మారథాన్ వాకింగ్, సైక్లింగ్, సూపర్‌ఫాస్ట్ క్యూబింగ్ వంటి పోటీలో పాల్గొని తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ మ్యాథ్స్, ఫ్రెంచ్ ఒలింపియాడ్‌లో గోల్డ్ మెడల్స్ సాధించారు. అబాకస్‌లో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ పొందారు. టేబుల్ టెన్నిస్, క్రికెట్, స్కేటింగ్ తదితర క్రీడల్లో మంచి ప్రావీణ్యతను పొందారు.
హోటల్స్‌లో మిగిలిపోయిన ఆహార పదార్థాలు వృథాకాకుండా ఉండేందుకు ఎన్జీవో ఆర్గనైజేషన్స్‌తో పేదలకు ఆన్లైన్లో అందించే విధంగా ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ప్యాకెట్మనీని పొదుపు చేసి బంజారాహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ ఐ దవాఖానకు రూ.3.50లక్షల విరాళాన్ని అందజేశారు. వీటితో పాటు పేదలకు అక్షరాస్యత, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణం, పౌష్టికాహారం తదితర సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
పేదల కష్టాలు కళ్లారా చూశాను. సాటి మనిషికి సాయం చేయాలన్న సంకల్పంతో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. స్నేహితులు, బంధుమిత్రులు, తల్లిదండ్రులు పూర్తి సహకారం అందిస్తున్నారు. మానసిక వికలాంగులు, వృద్ధులు, పేద పిల్లల చదువుకు సాయం చేస్తున్నాను. చదువు, ఆటపాటల్లో రాణిస్తూనే మదర్‌థెరిసా స్ఫూర్తితో సేవ చేస్తున్నాను. సుహ్రిత్