Sanitation Worker | అంబర్‌పేట: ‘నా భర్త ఉద్యోగం కోసం అడిగినందుకు లైంగికంగా వేధించడమే కాకుండా వేరే డివిజన్‌కు బదిలీ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్న ఎస్ఎఫ్ఏ గోల్నాక శ్రీనుపై చర్యలు తీసుకొని.. న్యాయం చేయాలి’ అని పారిశుధ్య కార్మికురాలు జి. సునీత ప్రభుత్వం, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం భర్త చెన్నయ్యతో కలిసి సునీత అంబర్‌పేటలో మీడియాతో మాట్లాడుతూ 25 ఏండ్ల కిందట అప్పటి ఎంసీహెచ్‌లో జి.సునీత శానిటేషన్ వర్కర్స్ గ్రూప్‌ను 21 మంది సభ్యులతో ఏర్పాటు చేసినట్లు బాధితురాలు తెలిపారు.
ఇందులో గ్రూపు అధ్యక్షురాలిగా తాను ఉంటూ.. పారిశుధ్య పనులు, తన భర్త చెన్నయ్య కామటీగా పని చేసినట్లు చెప్పారు. అప్పట్లో కాంట్రాక్టర్ నరసింహారెడ్డి వద్ద అంబర్‌పేట శ్రీరమణ చౌరస్తా నుంచి అలీకేఫ్ వరకు తాము పారిశుధ్య పనులను నిర్వహించే వారమన్నారు. 2012లో ప్రైవేట్ కాంట్రాక్ట్ పద్ధతిని తొలగించడంతో అప్పటి నుంచి తాము పటేల్‌నగర్ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఐదేండ్ల కిందట తన భర్త చెన్నయ్యకు ఫిట్స్, పక్షవాతం వచ్చిందని సునీత చెప్పారు. దీంతో తాము గ్రూపు సభ్యులందరి సమ్మతంతో నాగరాజుని తాత్కాలిక సహాయకుడిగా నియమించుకున్నట్లు వివరించారు.
అతను కొద్ది రోజులకే పని మానివేయడంతో బతుకమ్మకుంటకు చెందిన బాబును అందరి అంగీకారంతో సహాయకుడిగా పెట్టుకున్నామన్నారు. బాబు ఎస్ఎఫ్ఏ గోల్నాక శ్రీను సహకారంతో అధికారులకు ముడుపులు అందించి.. తన భర్త పేరును ఉద్యోగం నుంచి తొలగించి.. బాబు పేరును పెట్టి తమకు అన్యాయం చేశారని సునీత ఆరోపించారు. విషయం తెలిసి ఎస్ఎఫ్ఏ శ్రీను, బాబును అడిగితే తమపై దౌర్జన్యం చేయడమే కాకుండా ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డారన్నారు. ఎస్ఎఫ్ఏ గోల్నాక శ్రీను లైంగికంగా వేధిస్తూ, అతనికి లొంగకపోవడంతో తనను అన్యాయంగా నల్లకుంటకు బదిలీ చేయించాడని బాధితురాలు సునీత ఆరోపించారు. ప్రభుత్వం, బల్దియా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని చెన్నయ్య, సునీత దంపతులు విజ్ఞప్తి చేశారు.