కొండాపూర్, జూన్ 27 : కూతుళ్లపై లైంగిక దాడికి పాల్పడిన పిన తండ్రికి 20 ఏండ్ల జైలు శిక్షను విధిస్తూ రాజేంద్రనగర్ ప్రత్యేక పోక్సో కోర్టు గురువారం తీర్పునిచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగండ్ల ఫ్లైఓవర్ సమీపంలో నివసించే నర్సింలు (45) కూలీ. నర్సింలు తన రెండో భార్య, ఇద్దరు కూతుళ్లు, కొడుకుతో కలిసి ఉంటూ, తరచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. నర్సింలు తన పెద్ద కూతురును వెంట తీసుకుని భార్యను వెతకడానికి వెళ్లాడు. రెండు రోజుల తర్వాత తిరిగి రాగా, బాలిక ముఖంపై గాయాలను గమనించిన స్థానికులు.. విషయం తెలుసుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నర్సింలు తరచూ కూతుళ్లపై లైంగిక దాడికి పాల్పడుతూ, విషయం బయటకు చెబితే బాలుడిని చంపేస్తానంటూ బెదిరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ అనంతరం గురువారం రాజేంద్రనగర్ పోక్సో ప్రత్యేక కోర్టు.. 20 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించినట్లు చందానగర్ పోలీసులు తెలిపారు. బాధిత బాలికలకు రూ.5 లక్షల పరిహారాన్ని, బాలుడికి రూ. 50 వేలను అందజేయాలంటూ కోర్టు తీర్పునిచ్చినట్లు తెలిపారు.