జూబ్లీహిల్స్, జనవరి 18: రెండవ విడత కంటి వెలు గు కార్యక్రమం నేటినుంచి ప్రారంభం కానుంది. అంధ త్వ రహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టనుంది. ఇది సామాన్యులకు ఎంతో మేలు చేస్తుందని, ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరికీ కంటి చూపు ముఖ్యం.. ఇందులో భాగంగా అందరికీ కంటి సమస్యలు లేకుండా చూసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో సుదీర్ఘకాలంపాటు కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టేందుకు మరోమారు ఈ కార్యానికి సంకల్పించింది. రెండవ విడత కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ప్రారంభించనున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో వెంగళరావునగర్ డివిజన్ మధురానగర్ కమ్యునిటీ హాల్లో మంత్రులు.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనుండడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణకుగానూ యూసుఫ్‌గూడ సర్కిల్లో 5 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఎ.రమేశ్ తెలిపారు. బుధవారం యూసుఫ్‌గూడ సర్కిల్లో కంటి వెలుగు కేంద్రాలను అధికారులతో ఆయన ఈఈ రాజ్‌కుమార్‌తో పాటు వివిధ విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంసీ రమేశ్ మాట్లాడుతూ.. నేటినుంచి ప్రతిరోజు ఉద యం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటి వెలుగు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆయా కేంద్రాలలో కంటి వెలుగు శిబిరాలను ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు.
యూసుఫ్‌గూడలో ఇంటింటి ప్రచారం
ప్రతి ఒక్కరూ ఉచిత కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఎస్పిహెచ్ఓ డాక్టర్ రేవతి పేర్కొన్నారు. ప్రభుత్వం సంపూర్ణ అంధత్వ నివారణ లక్ష్యంగా 100 రోజులపాటు కంటి వెలుగు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని అన్నారు. బుధవారం యూసుఫ్‌గూడలో పంజాగుట్ట పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఇస్సాక్ న్యూటన్ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ర్యాలీగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. నేటి నుంచి ఎల్లారెడ్డిగూడ పీజేఆర్ కమ్యునిటీ హాలులో కంటి వెలుగు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ప్రణయశీల, మణెమ్మ, కవిత, ఆశవర్కర్లు తిరుపమ్మ, నవనీత తదితరులు పాల్గొన్నారు.
క్రమపద్ధతిలో జరిగేలా ఏర్పాట్లు: డీఎంహెచ్‌వో
అమీర్‌పేట్, జనవరి 18: కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్షలు చేయించుకునే వారికి శిబిరంలో ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటి తెలిపారు. గురువారం అమీర్‌పేట్‌లోని వివేకానంద కమ్యూనిటీ హాలులో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రారంభించనున్న కంటి వెలుగు శిబిరం ఏర్పాట్లను వైద్యులతో కలిసి పరిశీలించారు. కంటి పరీక్షల కోసం శిబిరంలోకి వచ్చే వారికి తమ పేర్ల నమోదు మొదలు కంటి చూపు పరీక్షించడం, అవసరమైన మందులు, కంటి అద్దాలను అందించడం వంటి అన్ని కార్యక్రమాలు క్రమపద్ధతిలో జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని, నగరంలోని మొత్తం 115 ప్రాంతాల్లో జరిగే కంటి వెలుగు శిబిరాల్లో కూడా ఇదే తరహాలో ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఏర్పాట్ల పరిశీలనలో డాక్టర్ వెంకటితో పాటు అమీర్‌పేట్ ఎస్పీహెచ్వో డాక్టర్ రేవతితో పాటు సిబ్బంది ఉన్నారు.
సిబ్బందికి అసౌకర్యం కలుగకుండా..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం నిరుపేదలకు ఎంతో మేలు చేస్తుందని బుధవారం అమీర్‌పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి పేర్కొన్నారు. వైద పరీక్షలకు వచ్చే వారికి వారి వారి అవసరాలను బట్టి కంటి అద్దాలు కూడా ఉచితంగా అందజేస్తారని, ఖరీదైన కంటి వైద్య పరీక్షలను ఈ శిబిరంలో ఉచితంగా చేయించుకుని ప్రభుత్వం ఇస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. ఇక్కడ సేవలందించే సిబ్బందికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేలా జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆమె ఏర్పాట్లను పరిశీలించారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్ పర్యవేక్షణలో ఇంజీరింగ్ విభాగం అధికారులు కావాల్సిన ఏర్పాట్లు చేపడుతున్నారని ఆమె తెలిపారు.
– అమీర్‌పేట్, జనవరి 18
కంటి వెలుగు కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు
కంటి వెలుగు కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు అమలుచేస్తున్నారు. కంటి పరీక్షల కోసం వచ్చే ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే నేపథ్యంలో అధికారులు యూసుఫ్‌గూడ, రహ్మత్నగర్తోపాటు ఆయా కేంద్రాలలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారి చేస్తున్నారు. దాంతో పాటు దోమల నిర్మూలనకు ఫాగింగ్ చేస్తున్నామని ఎంటమాలజీ ఏఈ సావిత్రి తెలిపారు.
– జూబ్లీహిల్స్, జనవరి 18