అల్లాపూర్, జనవరి 29: సీనియర్ సిటిజన్స్ భవన నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అల్లాపూర్ డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా గాయత్రినగర్‌లో సుమారు రూ.20 లక్షల అంచనా వ్యయంతో సీనియర్ సిటిజన్స్ భవనం నిర్మిస్తున్నారు. 300 గజాల్లో నిర్మిస్తున్న భవనం చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో తీర్చిదిద్దనున్నారు. విశాలమైన భవనం అందుబాటోకి రానుండటంతో స్థానికంగా ఉన్న సీనియర్ సిటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంతోషంగా ఉన్నది..
సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా భవనం లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ కూర్చున్నాం. మా సమస్యను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ సబీహాబేగం దృష్టికి తీసుకెళ్లడంతో వారు సానుకూలంగా స్పందించి నిధులు కేటాయించి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉన్నది.
త్వరలో అందుబాటులోకి తీసుకువస్తాం
సీనియర్ సిటిజన్ భవన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 300 గజాల స్థలంలో రూ.20లక్షల వ్యయంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నాం. నాణ్యతా ప్రమాణాలు పాటి స్తూ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తాం. – రంజిత్ ఏఈ