సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ‘కండ బలం, మంచి శరీర ఆకృతి కావాలనుకుంటున్నారా.. ఈ ఇంజక్షన్లు తీసుకోండి.. ఈ మాత్రలు వాడండి’.. అంటూ అమాయక యువతకు నిషేధిత ఇంజక్షన్లు, మాత్రలు విక్రయిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక జిమ్ నిర్వాహకుడితో పాటు అతడికి సహకరిస్తున్న మరొకరిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.10లక్షల విలువజేసే 53 రకాల నిషేధిత ఇంజక్షన్లు, మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఓటీ డీసీపీ మహ్మద్ అబ్దుల్ రషీద్ కథనం ప్రకారం.. చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన అహ్మద్ బిన్ అబ్దుల్ ఖాదర్ (33) స్థానికంగా అల్- నదీ ఫిట్నెస్ క్లబ్ పేరుతో జిమ్ నిర్వహిస్తున్నాడు. ఆశించిన మేరకు లాభాలు రాకపోవడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలనే దురాశ పుట్టింది. తన వద్దకు జిమ్ చేయడానికి వచ్చే యువతీ యువకులకు నిషేధిత ఇంజక్షన్లు, మాత్రలను అక్రమంగా విక్రయించాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో మంచి ఆకృతి, శరీర దారుఢ్యం పెంచడానికి తన వద్ద ఇంజక్షన్లు, మాత్రలు ఉన్నాయంటూ జిమ్‌కు వచ్చే యువతను నమ్మించాడు. వారికి నిషేధిత ఇంజక్షన్లు, మాత్రలు విక్రయించడం మొదలు పెట్టాడు. తనకు తెలిసిన వారి వద్ద నుంచి రూ. 300లకు ఒక ఇంజక్షన్ కొనుగోలు చేసి, జిమ్ చేసే యువతీ యువకులకు ఒక్కో ఇంజక్షన్ రూ.వెయ్యి నుంచి రూ.1400లకు మహ్మద్ ఇబ్రహీం (27) అనే వ్యక్తి సహాయంతో విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు.. నిషేధిత ఇంజక్షన్లు, మాత్రలను కొల్లూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు నిఘా పెంచారు. అహ్మద్ బిన్ ఖాదర్, మహ్మద్ ఇబ్రహీంను యాంటీ డ్రగ్ స్కాడ్, మాదాపూర్ ఎస్ఓటీ, కొల్లూరు పోలీసులు కలిసి పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.10 లక్షల విలువజేసే 53 రకాల నిషేధిత ఇంజక్షన్లు, మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఓటీ డీసీపీ ఎం.ఎ. రషీద్, అదనపు డీసీపీ సత్యనారాయణ పర్యవేక్షణలో కేసును ఛేదించిన మాదాపూర్ ఎస్ఓటీ, కొల్లూరు పోలీసు బృందాలను ఈ సందర్భంగా మాదాపూర్ డీసీపీ సందీప్ అభినందించారు.