సిటీబ్యూరో, నవంబర్ 26(నమస్తే తెలంగాణ): మెట్రో ఫేజ్-2 కోసం రూ.11,693 కోట్ల రుణాలతో విస్తరించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే డీపీఆర్ పూర్తి కాగా, మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయంలో 48 శాతం మేర జైకా, ఏడీబీ, ఎన్డీబీ (మల్టీ లేటరల్) వంటి ఆర్థిక సంస్థలను ఆశ్రయించనుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 7313 కోట్లు(30 శాతం), కేంద్ర వాటా రూ.4230 కోట్లు(18 శాతం), మల్టీ లేటరల్ సంస్థల నుంచి 48 శాతం, అనగా రూ.11,693 కోట్లను రుణాల రూపంలో నిధులు సేకరించనుంది.
ఈ అప్పులకు కేంద్రం గ్యారంటీగా ఉండగా, మిగిలిన 4 శాతం మేర రూ.1033 కోట్లను పీపీపీ విధానంలో సమకూర్చి ప్రాజెక్టును చేపడుతామని తెలిపారు. మొత్తం ప్రాజెక్టులో ఇదే కీలకమన్నారు. మెట్రో రైల్ ఫేజ్-1 నవంబర్ 28తో ఏడేళ్లు పూర్తి చేసుకోనుండగా, ఫేజ్-2 విస్తరణపై హెచ్ఎంఆర్ఎల్/ హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. నగరంలో రెండో దశలో ఆరు కారిడార్లలో 116.4 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించనున్నట్లుగా తెలిపారు.
ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్లు, మిగిలిన ఆరో కారిడార్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీకి 40 కిలోమీటర్ల మేర ప్రతిపాదనలను విడిగా రూపొందించినట్లుగా తెలిపారు. మిగిలిన 5 కారిడార్లకు రూపొందించిన డీపీఆర్‌కు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదంతో కేంద్రానికి అందించినట్లుగా స్పష్టం చేశారు.
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా మెట్రో విస్తరణ అత్యంత కీలకంగా మారిందన్నారు. తొలి దశలో అందుబాటులో ఉన్న మెట్రోతో నిత్యం 5.8 లక్షల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు.
రెండో దశ మెట్రోతో 10 లక్షల మంది ప్రయాణించే సౌకర్యం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు, నాగోల్ నుంచి రాయదుర్గ్ వరకు మొత్తంగా 69 కిలోమీటర్ల మూడు కారిడార్లలో మెట్రో మొదటి దశను రూ.22148 కోట్లతో పీపీపీ విధానంలో చేపట్టినట్లుగా తెలిపారు. ప్రస్తుతం, హైదరాబాద్ నగర అవసరాలకు అనుగుణంగా మెట్రో విస్తరణ అత్యంత కీలకంగా మారిందని, దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో మెట్రో పరిధి పెరుగుతుందన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోనూ మెట్రో విస్తరణ చేయాల్సిన వచ్చిందన్నారు.
రెండో దశలో అందుబాటులోకి వచ్చే మెట్రో రైలులో మూడు కోచ్‌లే ఉంటాయని స్పష్టం చేశారు. కానీ, స్టేషన్లను మాత్రం ఆరు కోచ్‌లకు అనుగుణంగా నిర్మిస్తామని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కోచ్‌లను ఆరుకు పెంచనుంది. అయితే, ఫేజ్-1లో ఎదురైన ఇబ్బందుల దృష్ట్యాల పార్కింగ్, బస్ బే, ఆటో ఫీడర్ బేలతో పాటు గ్రౌండ్ లెవల్లో మరింత స్థల సేకరణపై దృష్టి పెడతామన్నారు. ఎంఎంటీఎస్, ఆర్టీసీ, స్వీడా, ర్యాపిడో వంటి పలు రకాల రవాణా మార్గాలతో అనుసంధానం చేస్తామన్నారు. సిగ్నలింగ్, ఓహెచ్ఈ, కలెక్షన్, రోలింగ్ స్టాక్ వంటి వాటిలో ఆధునాతన సాంకేతికతను వినియోగిస్తామని స్పష్టం చేశారు.
రెండో దశ విస్తరణ కోసం హెచ్ఎంఆర్ఎల్ భారీ స్థాయిలో రుణాలను సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయంలో కేంద్ర, రాష్ట్ర వాటాలు పోను మిగిలిన మొత్తాన్ని జైకా, ఏడీబీ, ఎన్డీబీ వంటి సంస్థల నుంచి సేకరించనుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్త పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ ముందు వరుసలో ఉండటంతో… పలు ఫైనాన్షియల్ సంస్థలు ముందుకు వస్తున్నాయని, వేల కోట్ల రూపాయలు దేశంలోని మెట్రో నగరాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో 2శాతం వార్షిక వడ్డీతో రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. దీనికి ఎఫ్ఆర్బీఎం నిబంధనలు కూడా వర్తించవనీ, కేంద్ర పూచీకత్తుతో నిధుల సేకరణ సులభతరం అవుతుందన్నారు. మల్టీ లిటరెల్ సంస్థల ద్వారా రూ. 11,693 కోట్లు సేకరిస్తామన్నారు. మొదటి దశ మెట్రో వడ్డీ భారం కంటే వార్షికంగా 7శాతం మేర తగ్గుతుందన్నారు.
దేశంలోని ఇతర నగరాల మెట్రో నిర్మాణ వ్యయంతో పోల్చితే… రెండో దశ మెట్రో నిర్మాణ వ్యయం భారీగా తగ్గుతుందన్నారు. కిలోమీటర్ మెట్రో నిర్మాణానికి రూ.318 కోట్లు ఖర్చవుతుందన్నారు. బెంగుళూరులో రూ. 373 కోట్ల నుంచి 569 కోట్లు, చెన్నయ్‌లో రూ.619-756 కోట్లు, ముంబైలో రూ.543 కోట్లు నుంచి 1492 కోట్లుగా ఉందన్నారు. డిజైనింగ్ ఇన్నోవేషన్ ఆధారిత ఎలివేటెడ్ మెట్రో వలన తక్కువ ఖర్చుతో మెట్రో నిర్మాణం చేపడుతున్నట్లుగా తెలిపారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఏజెన్సీ ద్వారా ఈ ప్రాజెక్టును చేపట్టనుండగా, అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంతంలో సుమారు 1.6 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ మెట్రో అందుబాటులోకి వస్తుందని, మిగిలిన అన్ని కారిడార్లలో ఎలివేటెడ్ నిర్మాణమే ఉంటుందని స్పష్టం చేశారు.
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్న 7 కిలోమీటర్ల మేర ఓల్డ్ సిటీ మెట్రో పనులు డిసెంబర్ నెలాఖరు నుంచి వేగంగా జరుగుతాయన్నారు. జనవరి మొదటి వారంలో కూల్చివేతలతో పాటు, పనులు ప్రారంభమవుతాయన్నారు. ఇప్పటికే మెట్రో వల్ల రోడ్డు విస్తరణ ప్రభావితం అవుతున్న వారసత్వ, మతపరమైన కట్టడాలకు నష్టం లేకుండా ప్రాజెక్టును చేపడుతున్నట్లుగా తెలిపారు. ఈ ప్రాజెక్టు మొత్తం కూడా మొత్తం హెచ్ఏఎంఎల్ చేపడుతుందన్నారు.
రెండో దశలో నార్త్ సిటీకి మెట్రో విస్తరణపై భారీ స్థాయిలో చర్చ జరుగుతుంది. కానీ, క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో నార్త్ సిటీలో ఉన్న ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, జేబీఎస్ నుంచి తూంకుంట వరకు మెట్రో నిర్మాణంపై చర్చలు జరుగుతున్నాయన్నారు. కానీ, రెండో దశలో సాధ్యం కాదని, రైట్ ఆఫ్ వే, భూ సేకరణ, రక్షణ శాఖ భూముల సమీకరణ వంటి అంశాలు ఈ ప్రాజెక్టుకు ఆటంకం కలిగిస్తాయన్నారు. అయితే, ఈ మార్గంలో ప్రతిపాదిత హెచ్ఎండీఏ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుతో హెచ్ఎంఆర్ఎల్ సమన్వయం చేసుకుంటూ ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. డబుల్ డెక్కర్ ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నా, రెండో దశలో సాధ్యం కాదన్నారు.