సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): క్రియాయోగం సాత్విక లక్షణాలను పెంపొందిస్తుందని యోగదా సత్సంగ సొసైటీ, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ అధ్యక్షుడు స్వామి చిదానందగిరి పేర్కొన్నారు. క్రియా యోగ సాధన వల్ల మెదడు, హృదయం, నాడీమండల వ్యవస్థ అనే మూడు ఫలితాలు కలుగుతాయని చెప్పారు. వీటిని సాధించిన వ్యక్తి దృఢ సంకల్పంతో, దయార్ద్ర హృదయంతో తనకూ, సమాజానికి మంచి చేకూర్చే నిర్ణయాలు తీసుకొని పనిచేస్తాడని చెప్పారు.
హైదరాబాద్ శివారులోని కన్హా శాంతివనంలో జరిగిన ఐదురోజుల కార్యక్రమాల ముగింపు సమావేశంలో గురువారం ఆయన ప్రసంగించారు. నిరంతరం దైవంతో ఉండటమే నిజమైన సఫలతకు మార్గమని, నిద్రించేముందు-తర్వాత భగవంతుణ్ణి ధ్యానించాలని పిలుపునిచ్చారు. క్రియాయోగ పాఠాలు కోరుకొనేవారు https://yssofindia.org/te/lessons-programmes లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కార్యక్రమ సమన్వయకర్త నారాయణరావు సూచించారు.