మైలార్‌దేవ్‌పల్లి, జూలై 2: అత్తాపూర్ పరిధిలోని ప్రముఖ రెస్టారెంట్ బార్బె క్యూ నేషన్‌లో ఆహార భద్ర తా అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ లభించిన నిల్వ ఉంచిన నాణ్యత లేని మాంసం, అపరిశుభ్ర వాతావరణాన్ని గమనించిన అధికారులు రెస్టారెంట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి, భారీ జరిమానా విధించారు. అత్తాపూర్ పుడ్ ఇన్స్పెక్టర్ సౌమ్య మీడియాతో మాట్లాడుతూ బార్బెక్యూ నేషన్‌లో ఆహారం తిన్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురై పుడ్ పాయిజనింగ్ అయినట్లు హెచ్-ఫాస్ట్ బృందానికి ఫిర్యాదు అందిందన్నారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా పుడ్ సేప్టీ అధికారులు, హెచ్-ఫాస్ట్ బృందంతో కలిసి రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించామన్నారు. తనిఖీల్లో భాగంగా కిచెన్, మాంసం నిల్వ ఉంచే కోల్డ్ స్టోరేజీ గదులను పరిశీలించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. యాజమాన్యం చికెన్, మటన్ వంటి మాం సాన్ని దాదాపు 4-5 రోజుల పాటు నిల్వ ఉంచుతున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ప్రతి రోజూ పాత మాంసంపై ఉన్న లేబుళ్లను మారుస్తూ కొత్త లేబుళ్లను అంటిస్తూ కస్టమర్లను మోసం చేస్తున్నట్లు విచారణలో తేలింది.
ఎక్కువ రోజులు మాంసాన్ని నిల్వ ఉంచడం వల్లే అది కలుషితమై పుడ్ పాయిజనింగ్‌కు దారి తీసిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్ధాల తయారీ, నిల్వ ఉంచడం వంటి సెక్షన్ల కింద రెస్టారెంట్‌పై కేసు నమోదు చేశారు. చట్టపరమైన చర్యలతో పాటు జరిమానా విధిస్తున్నట్లు పుడ్ ఇన్స్పెక్టర్ సౌమ్యతెలిపారు.