బస్సులు సమయానికి రావడం లేదు. వస్తాయో రావో అనే సమాచారం చెప్పేవాళ్లు లేరు. ఫలితంగా ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తున్నది. నగరంలోని బస్టాప్‌లో బస్సుల సమాచారం చెప్పాల్సిన సిబ్బంది ఉండటం లేదు. ముఖ్యంగా రాత్రి 9 గంటల తర్వాత నగర శివార్లకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సుల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొన్నది. సికింద్రాబాద్ నుంచి ఉద్దెమర్రి వెళ్లే బస్సు రాత్రి 9 గంటల వరకు సర్వీసులు ఉంటాయి. కానీ ఆ బస్సు కోసం ఎదురుచూసే ప్రయాణికులకు కొన్ని సార్లు తిప్పలు తప్పడం లేదు. ఆర్టీసీ అధికారులు ఆ బస్సు చివరి ట్రిప్పులు ఎప్పుడు నిలిపివేస్తారో వారికే తెలియదు. బస్సు వస్తుంది కదా అని ప్రయాణికులు ఎదురుచూస్తుంటారు. చివర్లో బస్సు రాదు. ఆ సమాచారం చెప్పేవాళ్లు కూడా బస్టాప్‌లో అందుబాటులో ఉండరు. దీంతో ప్రయాణికులు అవస్థలుపడుతున్నారు.
– సిటీబ్యూరో
అరకొర బస్సులు!
నగర శివార్లకు రాత్రి 9 దాటిందంటే ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. రోజులో చివరి ట్రిప్పు వచ్చే బస్సులు ముందుగానే వెళ్లిపోతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. దీంతో తమ పరిస్థితి అయోమయంగా ఉంటుందని వివరించారు. నేరుగా వెళ్లే గమ్యస్థానానికి ఆర్టీసీ సమయపాలన లేని విధానం వల్ల మూడు, నాలుగు బస్సులు మారాల్సిన దుస్థితి ఉందని వాపోయారు. ముఖ్యంగా హుషారుపల్లి, ఆదిబట్ల, దుండిగల్, మోకీల,శంకర్పల్లి, కొల్లూర్ నియోపాలిస్ సమీపంలోని ప్రాంతాలకు సమయపాలన లేని అరకొర బస్సులు కాకుండా సరిపడా నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఆక్యుపెన్సీ లేదంటూ ఉన్న బస్సులను రద్దు చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రద్దీ ఎక్కడ ఉంది? బస్సులు సరిపడా ఉన్నాయా? లేదా? అని పరిశీలించడానికి అధికారులు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఏ రూట్లో బస్సులు పెంచాలో రిపోర్ట్ రెడీ చేయాలి. అలాంటి రిపోర్ట్‌లను సైతం ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. బస్సుల రాకపోకలపై సమీక్షలు సైతం చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్న ప్రైవేటు డ్రైవర్లు బస్సులను రోడ్డు మధ్యలోనే ఆపుతుండటంతో బస్సెక్కెందుకు ప్రయాణికులు పరుగులు తీస్తున్నారు. ఈ ఘటనలో పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. సెలవు రోజుల్లో రద్దీ మార్గాల్లో బస్సులను మరింత తగ్గిస్తున్నారు. 30 శాతం బస్సులు డిపోలకే పరిమితమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
గమ్యం యాప్ అంతే.?
బస్సుల సమాచారం అందించేందుకు ఆర్టీసీ ‘గమ్యం’ యాప్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. తొలుత సుమారు 4,170 బస్సులను ‘ఈ’ ట్రాకింగ్ సదుపాయం కల్పించారు. జిల్లా బస్సులతో పాటు పుష్పక్, మెట్రో బస్సుల్లోనూ ఈ యాప్‌తో పర్యవేక్షించేలా రూపొందించారు. ప్రయాణికులు సులభంగా బస్సు సేవలను ఉపయోగించుకునేల యాప్‌ను తీర్చిదిద్దారు. కానీ ఇప్పుడు ఆ గమ్యం యాప్ పనిచేయడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సు వివరాలు ఇచ్చినా.. నాట్ ఫౌండ్ అంటూ చూపిస్తుందని గ్రేటర్ ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. యాప్‌లో ఉన్న సమయానికి బస్సులు రావడం లేదని చెబుతున్నారు. కొన్ని సార్లు బస్సు సర్వీసులు రద్దవుతున్నాయని.. ఆ సమాచారం కూడా యాప్ సూచించడం లేదని వాపోతున్నారు. రాత్రి సమయంలో బస్సు సౌకర్యల కల్పించాలని కోరుతున్నారు.