శామీర్‌పేట, జనవరి 31 : ఏండ్ల నాటి కల నెరవేరింది. ప్రజలకు ఉపయోగంగా ఉండే రోడ్డు సౌకర్యం కోసం చాలా కాలంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ రోడ్డు నిర్మాణా నికి ఉన్న పరిస్థితుల దృష్ట్యా జాప్యం జరుగుతూ వచ్చింది. దీంతో దూరభారంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రెండున్నర కిలోమీటర్ల దూరం ఉన్న గమ్యస్థానాన్ని చేరుకోవడానికి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన దుస్థితి. చివరకు మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రత్యేక చొరవతో ప్రజలు పడుతున్న బాధలకు మోక్షం లభించింది. రోడ్డు నిర్మాణ కల సాకారమైంది. ఆలియాబాద్ చౌరస్తా నుంచి మెడిసిటీ చౌరస్తా వరకు సుమారు 2.5 కిలో మీటర్ల రోడ్డుకు పంచాయతీరాజ్ శాఖ నుంచి నిధులు మంజూరయ్యాయి.
శరవేగంగా నిర్మాణ పనులు
ప్రజావసరాల్లో భాగంగా వైద్య సేవల్లో ఉమ్మడి శామీర్‌పేట మండలం, పరిసర ప్రాంతాల ప్రజలకు మెడిసిటీ దవాఖాన ముఖ్యమైనది. అంతే కాకుండా మేడ్చల్ పట్టణానికి వెళ్లేందుకు ఈ దారి ఒకటని చెప్పవచ్చు. అలియాబాద్ చౌరస్తా నుంచి కేవలం 2.5 కిలో మీటర్ల దూరంలో మెడిసిటీ ఉంది. కానీ దవాఖానకు చేరుకోవాలన్న, మేడ్చ ల్ పట్టణానికి వెళ్లాలన్న దాదాపు 10 కిలో మీటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉండేవి. ఫారెస్ట్, ఇరిగేషన్, రెవెన్యూశాఖ భూములు ఉండడంతో ప్రజలకు ఈ దారి వేయడం కలగానే మారింది.
2004 నుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులు ఈ రోడ్డు నిర్మాణం కోసం తిరుగని ఆఫీసుల్లేవు. 2016లో తాత్కాలిక అనుమతులను శాఖలు ఇచ్చినప్పుటికీ మంత్రి మల్లారెడ్డి చొవరతో పంచాయతీ రాజ్‌శాఖ ద్వారారూ.5కోట్లు నిధులు మంజూరయ్యాయి. రోడ్డు నిర్మాణ పనులకు ఇప్పటికే పంచాయతీ రాజ్, ఫారెస్ట్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల ద్వారా అనుమతులు లభించాయి. ఈ రోడ్డు నిర్మాణంలో మెడిసిటీ దవాఖాన చేరుకోవడానికి ఉమ్మడి శామీర్‌పేట మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లో సుమారు15 గ్రామాల ప్రజల ఎంతో సులభదాయకం. రూ.5 కోట్లతో ఫార్మేషన రోడ్డు తో పాటు బీటీ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డు నిర్మాణంలో మొత్తం 5 నుంచి 6 బ్రిడ్జి, కల్వర్ట్లు నిర్మించనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో మట్టి రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వివరించారు.
ఏండ్లుగా ఎదురు చూస్తున్నాం…
అలియాబాద్ నుంచి మెడిసిటీ రోడ్డు నిర్మాణం కోసం ఏండ్లుగా ఎదురు చూస్తున్నాం. చెరువు నిండిందటే దాదా పు 10 కిలో మీటర్లు ప్రయాణం చేసి వెళ్లాల్సి వచ్చేది. చెరువులో నీరు తగ్గితే నడుచుకుంటూ అయిన దవాఖానకు వెళ్లే వాళ్లం. ఈ రోడ్డు నిర్మాణంలో దూరం తగ్గుతుంది. రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే దాదాపు 10 కిలో మీటర్ల దూరం, సమయం ఆదా అవుతుంది.
-నీరుడి బాలేష్, అలియాబాద్ గ్రామం
మంత్రికి రుణపడి ఉంటాం..
అలియాబాద్ చౌరస్తా-మెడిసిటీ రోడ్డు నిర్మాణంలో ఉమ్మడి శామీర్‌పేట మండల ప్రజలు మంత్రి మల్లారెడ్డికి, ప్రభుత్వానికి రుణపడి ఉంటా రు. ఎన్నో ఏండ్ల తర్వాత ప్రజల కోరిక నేరవేరుతున్నది. ప్రజావసరాలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలు చూపే నేతలే ప్రజలకు అవసరం. మండల ప్రజల తరఫున మంత్రికి కృతజ్ఞతలు.
-సరసం మోహన్‌రెడ్డి, సర్పంచ్ మజీద్‌పూర్ గ్రామం