సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసిన సేవ పరిపూర్ణం అవుతుందని రోటరీ క్లబ్ ఆఫ్ అభ్యుదయ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్-3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ బూసిరెడ్డి శంకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని ఓ హోటల్లో నిర్వహించిన రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రోటరీ క్లబ్ గవర్నర్ శంకర్ రెడ్డి, అతిథులుగా మల్లికార్జున దీక్షితులు, సన్యాసిరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రతి సభ్యుడు సత్కర్మలు చేస్తేనే జీవితం పరిపూర్ణం అవుతుందన్నారు. రోటరీ సభ్యులు సామాజిక రుగ్మతల నిర్మూలనలో ముందుంటారని అదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.
పల్స్ పోలియో నిర్మూలనలో విశేషంగా కృషి చేసినందుకు సంస్థకు ఎంతో గుర్తింపు వచ్చిందన్నారు. మహిళా స్వావలంబన, సర్వైకల్ క్యాన్సర్, మెస్ట్వ్రల్ అవేర్నెస్, కంటి చికిత్సలు, హెచ్వీపీ వ్యాక్సినేషన్, శిశుసంరక్షణ, అనాథలు, బ్యాడ్ టచ్ గుడ్ టచ్, గర్ల్స్‌కు సైకిళ్ల పంపిణీ లాంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మెంటల్ హెల్త్‌తోపాటు లీగల్ అవేర్నెస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా శిశువిహార్‌లోని 110 మంది చిన్నారులకు దుస్తుల కోసం సాయం చేశారు. దీంతోపాటు ఐసోలేషన్ రూమ్‌కు రోటరీ క్లబ్ సభ్యుడు రూ25.లక్షల విరాళం ప్రకటించారు.
ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ అభ్యుదయ్ హైదరాబాద్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. క్లబ్ అధ్యక్షుడిగా రొటేరియన్ సి.రాము, కార్యదర్శిగా బీఎస్ శరద్, కోశాధికారిగా రొటేరియన్ రాజేశ్, ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీగా రొటేరియన్ పద్మజ, వైస్ ప్రెసిడెంట్ రొటేరియన్ రితిక భార్గవ, జాయింట్ సెక్రెటరీ రొటేరియన్ అంజు అగర్వాల్, డైరెక్టర్ రొటేరియన్ నిహాల్, రొటేరియన్లు సుధారాణి, శైలజ, మంజుషా, అనురాధ, నిఖిల్షా, మనోహర్ ప్రసాద్ అగర్వాల్‌లను ఎన్నుకున్నారు. అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్షుడు సి.రాము మాట్లాడుతూ పేదల కోసం అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.