సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో మరో 118 రహదారులకు వాణిజ్య హోదా దక్కింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతా ల్లో నూతనంగా వాణిజ్య కారిడార్లుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయి వినియోగం, ఆయా మార్గాల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఎక్కువ అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. ప్రస్తుతం మెజార్టీ రెసిడెన్షియల్ జోన్‌గా ఉన్న మార్గాల్లో నివాసేతర నిర్మాణ అనుమతి సులువు అవుతుందని టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు తెలిపారు. ఇందుకుగానూ నివాసేతర భవన నిర్మాణ అనుమతులకు అదనంగా ప్రభావ రుసుం (ఇంఫాక్ట్ ఫీ)వసూలు చేయనున్నారు. ఈ ప్రక్రియ వల్ల ప్రజలకు సొంతంగా వాణిజ్య హోదా తెచ్చుకునే అవస్థ తప్పనుంది. కాగా ఈ కొత్తగా వచ్చే వాణిజ్య రహదారులపై ఆస్తి పన్ను వసూళ్లు పెరగనున్నాయి. కమర్షియల్ రోడ్ల ద్వారా వచ్చే వివిధ ఫీజుల ఆదాయాలను నాలాల అభివృద్ధికి వినియోగిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
మరో కేటగిరిలో హాస్పిటల్స్, నర్సింగ్ హోంలు, విద్యాసంస్థలు,ప్రజాఉపయోగ షాపులకు (500 గజాల్లోపు ఉన్న భవనాల్లో) నివాస భవనాలు, వ్యాపార కార్యకలాపాలు ఉండే భవనాలకు ఇంఫాక్ట్ ఫీ ఇలా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు వరకు 2శాతం లేదా ప్రతి చదరపు అడుగుకు అదనంగా రూ. 100లు చెల్లించాల్సి ఉంటుం ది. ఆపై నిర్మించే అంతస్తులకు 1 శాతం లేదా ప్రతి చదరపు అడుగుకు రూ. 50 చొప్పున ఇంఫాక్ట్ ఫీను వసూలు చేస్తారు.