మణికొండ/ శేరిలింగంపల్లి, డిసెంబర్ 17: గచ్చిబౌలి ఔటర్ రింగురోడ్డు ప్రాంతంలో నానక్‌రాంగూడ టోల్గేట్ సమీపంలో ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుకు ఆనుకొని ఉన్న సోలార్ రూప్‌టాప్ సైకిల్ ట్రాక్ స్తంభాలను తొలగించిన వీడియోలు మంగళవారం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడ లేని విధంగా దాదాపు 23 కిలోమీటర్ల మేర ఔటర్ చుట్టుపక్కల కోకాపేట్ పరిసర ప్రాంతాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టకపోగా ఉన్న వాటిని ఇలా కూల్చివేస్తుందని సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టుకు నెటిజన్లు కామెంట్లు చేశారు.
హెచ్ఆర్డీసీఎల్ అధికారులు మొత్తం 14 స్తంభాలను తొలగించి 60 సోలార్ ప్లేట్లను తీసివేశారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నివారించేందుకే తొలగించాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో మణికొండ, ల్యాంకోహిల్స్, చిత్రపురికాలనీ, పుప్పాలగూడ, మైహోం అవతార్ తదితర ప్రాంతాల వాసులు అవుటర్ మీదుగా మరింత సులభంగా ప్రయాణించేందుకు, అలాగే కనెక్టివిటీ ర్యాంపును నిర్మించేందుకు సైకిల్‌ట్రాక్‌ను తొలగించామని తెలిపారు. సైక్లింగ్ చేసుకునేవారు యథావిధిగా కొనసాగవచ్చని, ఎలాంటి అంతరాయం లేకుండా పనులను చేపడుతామని హెచ్ఆర్డీసీఎల్ అధికారులు పేర్కొన్నారు. మిగతా చోట్ల యథావిధిగా సైక్లింగ్ ట్రాక్ ఎప్పటిలాగే ఉంటుందని తెలిపారు.