బంజారాహిల్స్,డిసెంబర్ 23: ఆపరేషన్ రోప్లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎన్బీటీనగర్లో సోమవారం ఫుట్‌పాత్ ఆక్రమణలను అధికారులు కూల్చివేశారు. వెస్ట్‌జోన్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, ఏసీపీ కట్టా హరిప్రసాద్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ విభాగాల సిబ్బంది పెద్ద సంఖ్యలో వచ్చి ఎన్బీటీనగర్లోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి బస్తీలో మొత్తం ప్రధాన రహదారిపై ఆక్రమణలను తొలగించారు. కిరాణ షాపులు, హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థల ముందు ఉన్న రోడ్డును మొత్తం ఆక్రమించగా వాటిని కూల్చేశారు.
Building Demolished 1
షట్టర్లు ఉన్న వారు లోపల వ్యాపారం పెట్టుకోకుండా రోడ్లమీదకు రావడంతో రోడ్డుపై కనీసం ఆటోలు కూడా వెళ్లేందుకు వీల్లేకుండా మారిందని స్థానికులు ఫిర్యాదులు చేయడంతో ఆపరేషన్ రోప్ చేపట్టామని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే తెలిపారు. ఆక్రమణలకు పాల్పడిన వారికి చెందిన సామాన్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. మరోసారి రోడ్డుమీదకు వచ్చి వ్యాపారాలు కొనసాగిస్తే భవనాలను సీజ్ చేయించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక్కడ ఉన్న ఆక్రమణల కారణంగా బస్తీలోకి ఆర్టీసీ బస్సులు రావడం లేదని, దీంతో మహిళలు సుమారు కిలోమీటర్ దూరం నడవాల్సి వస్తోందని ఏసీపీ హరిప్రసాద్ తెలిపారు. ప్రతిరోజూ ఆక్రమణలపై నిఘా ఉంటుందని, ఎవరినీ ఉపేక్షించేదిలేదని పేర్కొన్నారు.