హైదరాబాద్ : రాష్ట్రంలో రెడ్‌క్రాస్(Redcross) సేవలను మరింత విస్తృత పరిచి పేదలకు సేవలందించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnudev Verma) సూచించారు. శుక్రవారం విద్యానగర్‌లోని బ్లడ్ బ్యాంక్(Blood Bank) ను సందర్శించారు.బ్లడ్ బ్యాక్‌లో అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను పరామర్శించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తరించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని పిలుపునిచ్చారు. అత్యాధునిక వసతులతో సెంట్రలైజేషన్ నూతన బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు అవసరమని, గడ్డిఅన్నారం రెడ్‌క్రాస్ సొసైటీ స్థలంలో నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. అందుకు కావలసిన నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించేలా కృషి చేస్తానని తెలిపారు.
త్వరలోనే మాసబ్‌ట్యాంక్, రంగారెడ్డి జిల్లాలో గౌలిదొడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలో మూడు బ్లడ్ బ్యాక్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ అజయ్ మిశ్రా, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీరాములు, మానిటరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ పి.విజయ్‌చందర్‌రెడ్డి, ఓపిఎస్ రెడ్డి, విజయభాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.