సిటీబ్యూరో, జూలై24, (నమస్తే తెలంగాణ): అరుదైన అన్నవాహిక సమస్యతో బాధపడుతున్న 32 ఏళ్ల మహిళకు నిజాంపేట్‌లోని హోలిస్టిక్ హాస్పిటల్లో మినిమల్లీ ఇన్వాసివ్ పోయెమ్(పెరోరల్ ఎండోస్కోపిక్ మయోటమీ) ప్రక్రియ ద్వారా విజయవంతమైన చికిత్స చేశారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం..‘నిజాంపేట్‌కు చెందిన కృష్ణవేణి కొన్నిరోజులుగా భోజనం తర్వాత ప్రతిరోజు విపరీతమైన వాంతులతో బాధుడుతూ అనేక దవాఖానల చుట్టూ తిరిగింది.
అయినా కూడా ఉపశమనం లేకపోవడంతో ఇటీవల హోలిస్టిక్ ఆస్పత్రిలో చేరడంతో, వెంటనే ఎండోస్కోపిక్, కొలనోస్కోపిక్ చికిత్సల్లో నిపుణులైన గ్యాస్ట్రో ఎంటరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీనివాసులు పరీక్షించారు. రిపోర్టుల ఆధారంగా పోయెమ్ ప్రక్రియ సూచించారు. ఎండోస్కోప్ ద్వారా పూర్తిగా నిర్వహించే ఈ ప్రక్రియలో శరీరంలో ఎలాంటి కోతలు పెట్టకుండా అన్నవాహికలోని లోపలి కండరాలపై నియంత్రిక మయోటమి చేయడం ద్వారా అన్నవాహిక ఒత్తిడిని తగ్గించి మింగే ప్రక్రియను సులభతరం చేస్తారు. ఈ చికిత్స విజయవంతమవడంతో రోగి కూడా ప్రస్తుతం ఆరోగ్యంగా ఉందని’ హోలిస్టిక్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.