సిటీబ్యూరో, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి చెందిన మాజీ శాస్తవ్రేత్త డాక్టర్ శైలజా దోనెంపూడి అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. 80 ఏళ్ల సీఎస్ఐఆర్ చరిత్రలో ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలోని బిజినెస్ డెవలప్మెంట్ గ్రూప్ (BDG)కి విభాగాధిపతి విశిష్ట శాస్తవ్రేత్త (DS)గా నియమితులైన తొలి మహిళగా శైలజ నిలిచారు.
తాజాగా ఆమె అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పాలిమర్ కెమిస్ట్రీలో పీహెచ్డీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సీ, ఎంఫిల్ పూర్తిచేసిన తర్వాత డాక్టర్ శైలజ 1993లో ఐఐసిటిలో చేరారు. పాలిమర్ సంశ్లేషణ, క్యారెక్టరైజేషన్, అధునాతన సాంకేతికత అభివృద్ధికి ఆమె విశేష కృషి చేశారు.
పరిశోధన రంగంలో ఆమె ప్రతిభకు 1996లో సీఎస్ఐఆర్ – డీఏఏడీ ఫెలోషిప్తో జర్మనీలోని కీల్ విశ్వవిద్యాలయంలో అధునాతన పరిశోధనలో పాల్గోనే అవకాశాన్ని చేజిక్కించుకుంది. 2017 నుంచి డాక్టర్ శైలజ ఐఐసిటిలో బిజినెస్ డెవలప్మెంట్ రీసెర్చ్ మేనేజ్మెంట్ చైర్ ఉమెన్‌గా కూడా పనిచేశారు.
ఐఐసిటి సహకారంతో పరిశ్రమ అవసరాలకు అనువైన నమూనాలను అభివృద్ధి చేశారు. సాంకేతికత బదిలీ, పేటెంట్ అవుట్-లైసెన్సింగ్, పారిశ్రామిక ఆదాయాన్ని గణనీయంగా పెంచడానికి ఆమె ఎంతగానో కృషి చేశారు. పాలిమర్ కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్, డిప్లొమసీ, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మేనేజ్మెంట్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కాగా ఆమె నియామకంపై సీఎస్ఐఆర్ లేబరేటరీల పరిశోధకులు హర్షం వ్యక్తం చేశారు.