సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): మధ్యాహ్నం వరకు భానుడి భగభగతో వేడెక్కిన నగరం సాయంత్రం అక్కడక్కడ చిరుజల్లులు పడడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆదివారం గ్రేటర్ పరిధిలోని కూకట్పల్లి, శేరిలింగంపల్లి, షేక్‌పేట్, ఉప్పల్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడడంతో నగరవాసులు ఎండ తీవ్రతనుంచి కొంత ఉపశమనం పొందారు. కాగా పశ్చిమ బీహార్ నుంచి ఛత్తీస్ గఢ్ మీదుగా ఉత్తర తెలంగాణ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీచేశారు. పాక్షికంగా మేఘావృతమైన ఆకాశం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నదని.. సాయంత్రం, రాత్రి సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 39, కనిష్ఠంగా 27 డిగ్రీలు ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.