Rachakonda | హైదరాబాద్ : ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా, అతన్ని ప్రాణాలతో కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ అభినందించారు.
ఈ నెల 13వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో ఎల్బీనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ టీ సతీశ్ విజయవాడ బస్టాప్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే అక్కడున్న ఫ్లై ఓవర్‌పై ఓ వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఫ్లై ఓవర్‌పై నుంచి కిందకు దూకే ప్రయత్నం చేయగా, ప్రయివేటు ఉద్యోగి జాన్సన్ గమనించి, ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను అప్రమత్తం చేశాడు. ఇక ట్రాఫిక్ కానిస్టేబుల్, జాన్సన్ కలిసి.. ఆ వ్యక్తిని మాటల్లో పెట్టారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించి, ఆ వ్యక్తి తువాల్ను గట్టిగా పట్టుకుని కిందకు లాగారు. దీంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం బాధిత వ్యక్తిని పోలీసులకు అప్పగించారు.
బాధితుడిని జార్ఖండ్‌కు చెందిన మాంగ్ర(35)గా పోలీసులు గుర్తించారు. ఆర్థిక సమస్యలు వెంటాడుతుండటంతో.. ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. మాంగ్రను ప్రాణాలతో కాపాడిన కానిస్టేబుల్ టీ సతీష్‌ను రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ అభినందించి, రివార్డు అందజేశారు.