Food Safety | సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : రోడ్డుపక్కన మిర్చీ బండి.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్.. ఫైవ్ స్టార్ హోటల్.. స్థాయి ఏదైనా వాటిలో లభించే ఆహార పదార్థాల్లో ఏదో ఒక రూపంలో కల్తీ జరుగుతున్నదని ఆహార పరిరక్షణ సంస్థ నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడవుతున్నది. టీ పొడి, పాలు, పండ్లు, పప్పులు, సాస్‌లు, చక్కెరతో చేసే మిఠాయిలు, నూనె, కారం పొడి, బేకరీ ఉత్పత్తులు, నిల్వ తీపి పదార్థాలు, హోటళ్లలో తయారు చేసిన ఆహారాల వరకు అన్నింటిలోనూ నాణ్యతా ప్రమాణాలు లోపించాయని తనిఖీలు స్పష్టం చేస్తున్నాయి.
కొరవడిన ప్రమాణాలు సగటు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ నేపథ్యంలోనే ఆహార నాణ్యత విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఆహార నాణ్యత విషయంలో అనుమానం ఉంటే అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి..నిర్ధారించనున్నారు. రోజూ వాడే ఆహార పదార్థాల్లో కల్తీ జరుగకుండా నిరంతర పర్యవేక్షణ చేసేందుకు ఫుడ్ సెక్యూరిటీ స్టాండెర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రయోగాత్మకంగా ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ మొబైల్ వ్యాన్‌ను గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మొబైల్ వ్యాన్‌తో సత్ఫలితాలు వస్తుండటంతో జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో జోన్‌కు ఒకటి చొప్పున ఈ మొబైల్ వ్యాన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
త్వరలోనే జోన్‌కు ఒకటి చొప్పున ఈ వ్యాన్‌ను అందుబాటులోకి తేస్తామని అధికారులు తెలిపారు. ఈ మొబైల్ వాహనంలో అక్కడికక్కడే నాణ్యతను నిర్ధారించనున్నారు. హానికరం, నకిలీ (మిస్ బ్రాండెడ్), నాసిరకం ఇలా మూడు రకాల ప్రమాణాలపై పరీక్షలు జరుపుతారు. కల్తీ ఉన్నట్లు గుర్తిస్తే అవగాహన, చైతన్యం కలిగించి ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తారు. మరోసారి పునరావృతమైతే జరిమానాలు, శిక్షణ విధిస్తారు. ప్రతి రోజూ ఒక్కో సర్కిల్లో పర్యటించి ఆహార నాణ్యతల నిగ్గు తేల్చే పనిలో జీహెచ్ఎంసీ నిమగ్నమైంది. ఆహార నాణ్యతా ప్రమాణాల విషయంలో అనుమానాలుంటే జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ 040- 2111 1111లో సంప్రదించాలని అధికారులు కోరారు.