అంబర్‌పేట : బస్తీలు, కాలనీల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం అత్యంత ప్రధానమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ తురాబ్‌నగర్‌లో రూ.30 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను డివిజన్ కార్పొరేటర్ బి.పద్మవెంకటరెడ్డితో కలిసి గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా వివిధ బస్తీల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటికి తగ్గట్లుగా ప్రతిపాదనలు సిద్ధం చేయించానని తెలిపారు. ప్రతిపాదనలకు సంబంధించి .జనరల్ బడ్జెట్ నుంచి నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు.
గత వారం రోజులుగా నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, బాగ్‌అంబర్‌పేట, అంబర్‌పేట డివిజన్లలో నిరాటంకంగా అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నో దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై సమస్యలతో సతమతమవుతున్న స్థితిలో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అన్ని డివిజన్లలో సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో శ్రమిస్తున్నట్లు చెప్పారు.
ఇందులో భాగంగా ప్రభుత్వ సహకారంతో ప్రజల భాగస్వామ్యంతో ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటు ముందుకు వెళ్తున్నానని అన్నారు. కుర్మబస్తీలో రూ.13.60 లక్షలతో ఏర్పాటు చేయనున్న డ్రైనేజీ పైప్‌లైన్ పనులను కార్పొరేటర్ బి.పద్మవెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే పోచమ్మబస్తీ, కుర్మబస్తీలలో పాదయాత్ర నిర్వహించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ సుధాకర్, జలమండలి డీజీఎం సతీష్, మేనేజర్ మాజిద్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.