మేడ్చల్, సెప్టెంబర్6(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆస్తులను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో క్రయ, విక్రయదారులకు ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో మండిపడుతున్నారు. దీంతో ఆస్తుల క్రయ, విక్రయాలకు సంకెళ్లు వేసినట్లయింది. ఆస్తుల రక్షణకు బీఆర్ఎస్ అండగా నిలిచి పోరుబాట చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన మూలంగా నిషేధిత జాబితా నుంచి తొలగించే పక్రియను రెవెన్యూశాఖ వేగవంతం చేసిన విషయం విధితమే. నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు అధికారులు రిజిస్ట్రేషన్‌శాఖకు తొలగింపు జాబితాను కంప్యూటర్లలో అప్లోడ్ చేస్తున్నారు. వివిధ సర్వే నంబర్లను తొలగిస్తున్నప్పటికీ సమస్యలు మాత్రం క్రయ, విక్రయదారులను వదలడం లేదు.
గృహాలు, అపార్ట్మెంట్ ప్లాట్లు, ఖాళీ స్థలాలను కొనుగోలు చేసిన కొనుగోలు దారులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజల ఆస్తులను ఇప్పుడిప్పుడే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్న నేపథ్యంలో పలు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వేచి చూసే ధోరణి అవలంభిస్తుంది. గృహాలు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు, ఖాళీ స్థలాలు కొనుగోలుకు అడ్వాన్స్‌లు ఇచ్చిన వారికి కొనుగోలుకు సంబంధించి పూర్తి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. బ్యాంకు చుట్టూ కొనుగోలుదారులు తిరుగుతున్న బ్యాంకు అధికారులు మాత్రం రుణాలు ఇవ్వడంలో కొంత సమయం పడుతుందని తిప్పి పంపుతున్నట్లు చెబుతున్నారు. ప్రజల ఆస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చడం ఏమిటోగాని క్రయ, విక్రయదారులు ప్రభుత్వం చేసిన తప్పిదానికి చుక్కలు చూస్తున్నారు. బ్యాంకులు మాత్రం రుణాలు అందించేందుకు మరింత సమయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
22ఏ నిషేధిత జాబితాలో ప్రజల ఆస్తులను చేర్చిన నేపథ్యంలో సబ్రిజిస్ట్రార్ల కార్యాలయాల వద్ద దళారుల దందా కొనసాగుతుంది. నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు రెవెన్యూ అధికారులు బాధితులకు చెబుతుండటంతో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు సబ్రిజిస్ట్రార్ల కార్యాలయాల వద్దకు వెళుతున్న బాధితులకు ఉద్యోగులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నిషేధిత జాబితా నుంచి అనేక సర్వే నంబర్లను తొలగించినందున రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరుగుతున్నాయని చెబుతున్నప్పటికీ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బాధితులు చేసేది ఏమీలేక తిరిగి మళ్లీ దళారులను ఆశ్రయించాలిన్స పరిస్థితి వచ్చింది.