Mrs India 2025 | మారేడ్‌పల్లి, మే 6: రాజస్థాన్‌లోని ఉదయపూర్ నగరంలో ఇటీవల జరిగిన మిసెస్ ఇండియా దివా సీజన్-6 గ్రాండ్ ఫినాలేలో హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన ప్రియాంక సందూరి విజేతగా నిలిచింది. దివా బ్యూటీ పేజెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలో దేశంలోని నలుమూలల నుంచి సుమారు 3500 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇందులో 32 మందిని ఫైనల్స్‌కు ఎంపిక చేశారు.
ఈ పోటీల్లో ఫ్యాషన్ షో, టాలెంట్ రౌండ్, నేషనల్ కాస్ట్యూమ్స్, ఇంటర్వ్యూస్ వంటి ప్రశ్నోత్తర రౌండ్స్ నిర్వహించగా..అన్నింటిలోనూ ప్రియాంక సందూరి తమ ప్రతిభను కనబరిచారు. ముఖ్యంగా అమ్మవారి వేషధారణలో పలువురిని ఎంతగానో ఆకట్టుకుంది. అదేవిధంగా మహిళలపై జరుగుతున్న గృహ హింస, వరకట్న వేధింపులపై నాటక రూపంలో ప్రదర్శించారు. లండన్‌లో స్థిరపడిన ఈమె మిసెస్ ఇండియా దివా 2025 టైటిల్‌ను గెలుచుకున్నారు. జాతీయ టైటిల్ గెలిచిన తొలి దక్షిణ భారతీయ మహిళగా ఆమె నిలిచారు. టైటిల్ గెలుచుకున్న అనంతరం నగరానికి చేరుకున్న ప్రియాంక సందూరిని తల్లిదండ్రులు అభినందించారు.
ఈ కార్యక్రమ జడ్జిలుగా డాక్టర్ యశ్వర్థన్ రణావత్, డాక్టర్ లోకేశ్వరి రాథోర్, రీనా తోష్నివాల్, బినీ భట్ (మిస్ ఎర్త్ 2022) వ్యవహరించారు. అతిథులుగా ఎఫ్కా పురోహిత్, బాలీవుడ్ సంగీత దర్శకుడు హర్షవర్థన్ శ్రీవాస్తవ పాల్గొన్నారు. ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఏకైక మహిళగా తాను పాల్గొని మిసెస్ ఇండియా దివా 2025 టైటిల్ గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ప్రియాంక చెప్పారు.