సిటీబ్యూరో, జూన్ 8(నమస్తే తెలంగాణ): ట్రేడింగ్‌లో మంచి లాభాలొస్తాయంటూ నమ్మించి సైబర్‌నేరగాళ్లు ఒక ప్రైవేట్ ఉద్యోగి వద్ద నుంచి రూ. 1.44 కోట్లు కొట్టేశారు. వివరాల్లోకి వెళితే…హస్తినాపురానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగికి గత నెల 3వ తేదీన సచితారెడ్డి అనే యువతి వాట్సాప్‌లో కాంటాక్టు అయ్యింది. తాను మార్కెట్ యాక్సెస్ కంపెనీలో పనిచేస్తున్నానని, ట్రేడింగ్ చేస్తున్నానని, నా వాలెట్లో భారీగా డబ్బు ఉంది, మీరు ట్రేడింగ్ చేసి డబ్బు సంపాదించుకునేందుకు ఇదే అవకాశమంటూ మాట్లాడింది.
నమ్మిన బాధితుడు మొదట రూ. 50 వేలు పెట్టుబడిగా పెట్టాడు. ఒక్క రోజులోనే రూ. 8 వేల లాభం వచ్చింది. ఆ డబ్బును బాధితుడి ఖాతాలోకి డిపాజిట్ చేశారు. నేరగాళ్లు చెప్పినట్లు యాప్‌డౌన్‌లోడ్ చేసి అందులో అకౌంట్ తెరిచాడు, అందులో తనకు ఉన్న వ్యాలెట్‌లో తనకు వచ్చిన రూ. 8 వేల లాభాన్ని తిరిగి పెట్టుబడిగా పెట్టాడు. అయితే అవి విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీనిపై కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే మీరు రూ. 8 వేల డ్రా చేస్తే మీ వ్యాలెట్ డ్యామేజ్ అవుతుందని, ప్రొఫైల్ దెబ్బతిట్టుందంటూ భయపెట్టించారు.
మీ వ్యాలెట్‌లో ఎంత డబ్బు ఉంటే అంతా రుణం పొందే అవకాశాలు మున్ముందు వస్తాయని దానిని దృష్టిలో పెట్టుకొని ట్రేడింగ్ చేయాలంటూ సూచనలు చేశారు. మే 6వ తేదీ నుంచి జూన్ 6 వరకు దఫ దఫాలుగా రూ. 1,44,20,000 కోట్లు బాధితుడు పెట్టుబడిగా పెట్టాడు. మీకు ఆమెరికా డాలర్లు అప్పుగా ఇప్పిస్తామంటూ నమ్మిస్తూ బాధితుడి ఖాతాలో నకిలీ షేర్లు ట్రాన్స్ఫర్ చేసి బాధితుడి వద్ద నుంచి డబ్బు వసూలు చేశారు. అయితే తన డబ్బే వ్యాలెట్‌లో ఉన్నా దానిని విత్ డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో పాటు ఇంకా పెట్టుబడి పెట్టాలని నేరగాళ్లు కోరుతుండడంతో అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఫ్రాంఛైజ్ ఇప్పిస్తామంటూ..
టాటా పవర్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఫ్రాంఛైజ్ ఇప్పిస్తామంటూ ఓ డాక్టర్‌కు సైబర్‌నేరగాళ్లు రూ. 29 లక్షలు బురిడీ కొట్టించారు. గడ్డిఅన్నారానికి చెందిన ఓ వైద్యురాలు ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్నెట్లో ఫ్రాంఛైజ్ ఆప్ టాటా పవర్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ కోసం బ్రౌజింగ్ చేసి ఒక వెబ్‌సైట్‌ను గుర్తించింది. అందులో తన వివరాలు పొందు పరిచింది. రెండు రోజుల వ్యవధిలో తాను టాటా పవర్ ఈవీ ఛార్జింగ్ బిజినెస్ డెవెలప్మెంట్ ఎగ్జిక్యూటివ్‌నంటూ శ్రీవాస్తవ్ పేరుతో బాధితురాలికి ఫోన్ వచ్చింది. తనకు మూడు ఫ్రాంఛైజ్ కావాలంటూ ఆమె కోరింది. అయితే మీ దరఖాస్తును అప్రూవల్ చేశామని, అప్రూవల్ లెట్ బిజినెస్ డెవెపల్మెంట్ మేనేజర్ నుంచి మీకు వస్తుందంటూ సూచించారు.
అప్రూవల్ లెటర్ బాధితురాలికి అందగానే ఫ్రాంఛైజ్ అమౌంట్ ఒక్కో దానికి రూ. 2.5 లక్షలు చెల్లించాలని ఇవి రిఫండబుల్ అని సూచించారు. దీంతో బాధితురాలు ఆ మొత్తాన్ని చెల్లించడంతో ఈ మెయిల్లో అగ్రిమెంట్ పేపర్ పంపించారు. ఆ తరువాత ఈవీ ఛార్జింగ్‌కు సంబంధించిన సామగ్రి, ఇన్సూరెన్స్ కోసం డబ్బులు వసూలు చేశారు. ఆ తరువాత మీకు బ్యాటరీల సామర్థ్యం ఎక్కువగా ఉన్న ఫ్రాంఛైజ్‌కు అనుమతిస్తామంటూ ఇలా రక రకాలుగా బాధితురాలి నుంచి రూ. 29,22, 900 లక్షలు సైబర్‌నేరగాళ్లు దోచేశారు. ఇంకా డబ్బు అడుగుతుండడంతో అనుమానం వచ్చి రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.