గోల్నాక, మే 25: పోలీసు ఉద్యోగాల కోసం కళలుగన్న యువత ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పిలుపునిచ్చారు. గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పోలీసు ఉద్యోగాల అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, మలక్‌పేట డివిజన్ ఏసీపీ వెంకటరమణ, అంబర్‌పేట ఇన్స్పెక్టర్ సుధాకర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం కొలువుల జాతర కొనసాగిస్తున్నదని అన్నారు. ప్రత్యేకంగా పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నించే నిరుద్యోగ యువతకు తోడ్పాటు అందించానే ఉద్దేశంతో అంబర్‌పేట నియోకవర్గంలోని అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్నారు. తాము ఊహించని విధంగా సుమారు 5 వందల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోడం అభినందనీయమని తెలిపారు.
మూడు నెలల పాటు ఒక తపస్సులా శిక్షణ తీసుకొని ఉద్యోగాలు సాధించి తమ లక్ష్యం నెరవేర్చుకోవాలని ఆయన కోరారు. ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ వెంకటరమణ మాట్లాడుతూ.. పోలీసు శాఖలో తమ అనుభవాలను అభ్యర్థులకు వివరించడంతో పాటు పట్టుదలతో ఉద్యోగం సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈస్ట్ జోన్ పరిధిలో శారీరకంగా, మానసికంగా సిద్ధమైన అభ్యర్థులకు ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లో మూడు నెలల పాటు శిక్షణ ఇస్తామన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో సుమారు ఐదు వందల మంది అభ్యర్థులు పాల్గొన్నారు.