దుండిగల్, ఆగస్టు 20: బౌరంపేట్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విషసర్పాలకు నిలయంగా మారుతున్నదని పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వారం రోజుల వ్యవధిలోనే నాలుగుసార్లు పాఠశాల ప్రాంగణంలో పాములు కనిపించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు బేంబేలెత్తుతున్నారు. పాఠశాల చుట్టూ పొదలు పెరగడంతో పాటు పాఠశాలను ఆనుకుని ఓ వైపు ముళ్లకంపలు,చెత్తాచెదారం పేరుకు పోవడంతోనే విషసర్పాలు నేరుగా పాఠశాల ఆవరణలోకి ప్రవేశిస్తున్నాయని పేర్కొంటున్నారు.
ఇటీవల విద్యార్థులు, చెప్పులు, షూస్ల్లోకి ఓ పాము దూరిందని, ఆ సమయంలో ఉపాధ్యాయుడు గమనించడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెబుతున్నారు. గడిచిన వారంరోజుల్లో ఓ రోజు నాగుపాము, మరోరోజు రక్తపింజర వంటి విషసర్పాలతో పాటు మరో రెండు పాములు పాఠశాల ప్రాంగణంలో దర్శనమివ్వడంతో విద్యార్థులు భయం, భయంగా చదువును కొనసాగిస్తున్నట్లు తెలుస్తున్నది. సర్కిల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి పాఠశాల చుట్టుపక్కల పాములకు ఆవాసంగా మారిన ప్రాంతాలను శుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు.