మాదాపూర్, మే 30: కొవిడ్ తరువాత భారతీయ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ గణనీయమైన తోడ్పాటును అందించిందని ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) డైరెక్టర్ జనరల్ రవి ఉదయ భాస్కర్ అన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన ఫార్మాలిటికా – 2024 ఎక్స్‌పోకు ముఖ్య అతిథిగా ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) డైరెక్టర్ జనరల్ రవి ఉదయ భాస్కర్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొవిడ్ మహమ్మారి తరువాత ఫార్మాస్యూటికల్ పరిశ్రమ గణనీయమైన తోడ్పాటును అందిస్తుందన్నారు.
2024 ఆర్థిక సంవత్సరంలో యూఎస్డీ 27.8 బిలియన్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేసినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సవాళ్ళు ఉన్నప్పటికి 9.6 శాతం వృద్ధి రేటును సాధించామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 31 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఎగుమతుల్లో 50 శాతం అధిక నియంత్రణ కలిగిన మార్కెట్లకు వెళ్తున్నాయన్నారు. అనంతరం, భారత్, టర్కీ మధ్య ఫార్మా కాన్సుల్ జనరల్ ఓర్హాన్ యల్మాన్ ఓకాన్ మార్కెట్ మాట్లాడుతూ, భారతదేశానికి ఫార్మా రాజధానిగా హైదరాబాద్ మారుతోందన్నారు. భారతదేశం, టర్కీ రెండు ఈ రంగంలో ఎదుగుతున్నట్లు చెప్పారు.
ఇన్ఫార్మా మార్కెట్స్ మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్ ముద్రాస్ మాట్లాడుతూ, భారతదేశం యొక్క బల్క్ డ్రగ్ ఉత్పత్తికి కేంద్రంగా హైదరాబాద్ వెలుగొందుతుందన్నారు. అభివృద్ధి చెందుతున్న పోకడలు, సవాళ్ళు వాటాదారులకు కీలకమైన వేదికగా ఫార్మాలిటీకా వృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్, ఇండియన్ ఫార్మాకోపోయియా కమిషనర్ గౌరవ్ ప్రతాప్ సింగ్, ప్రపంచ ప్యాకేజింగ్ ఆర్గనైజేషన్, బోర్డు సభ్యుడు ఏవీపీఎస్ చక్రవర్తి, బీడీఎంఏ (బల్క్ డ్రగ్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్) జాతీయ అధ్యక్షుడు ఆర్కే అగర్వాల్, సౌత్ ఏషియా వెయోలియా వాటర్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ బిజినెస్ లీడర్ గోపాల్, ఇన్ఫార్మా మార్కెట్స్ సీనియర్ గ్రూప్ డైరెక్టర్ రాహూల్ దేశ్ పాండే, ఇన్ఫార్మా మార్కెట్స్ మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్ ముద్రాస్లు పాల్గొన్నారు. కాగా, 80కి పైగా ఫార్మా కంపెనీలకు చెందిన స్టాల్స్‌లో వారి ఉత్పత్తులు, ఔషధాలను ఇక్కడ అందుబాటులో ఉంచారు.