Hyderabad | సిటీబ్యూరో, ఏప్రిల్22, (నమస్తే తెలంగాణ): కడుపునొప్పి, మూత్రంలో మంటతో బాధపడుతున్న 46ఏళ్ల ఓ మహిళకు శస్త్ర చికిత్స చేసి పిత్తాశయం, గర్భసంచి తొలగించిన అరుదైన ఘటన పేట్లబుర్జ్‌లోని మోడర్న్ గవర్నమెంట్ మెటర్నిటీ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
వివరాలు.. నేపాల్‌కు చెందిన 46 ఏళ్ల చందా థాపా అనే మహిళ సికింద్రాబాద్‌లో నివాసముంటోంది. కాగా ఆమెకు 3 నెలలుగా తీవ్ర కడుపునొప్పి, మూత్రంలో మంట కలగడంతో అనేక ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయినా కూడా నొప్పి తగ్గకపోవడంతో వారం రోజుల క్రితం పేట్లబుర్జ్‌లోని మోడర్న్ గవర్నమెంట్ మెటర్నిటీ ఆసుపత్రిలో చేరారు. వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె కడుపులో గడ్డ, పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు నిర్ధారించారు. గైనకాలజిస్టు డాక్టర్ సుజాత హిస్టరెక్టమీ, యూనిలేటరల్ ఊఫొరెక్టమీ శస్త్ర చికిత్స నిర్వహించి 1.6 కిలోల గర్భసంచి తొలగించగా, జనరల్ సర్జన్ డాక్టర్ రమేష్ చోలీసిస్టెక్టమీ శస్త్ర చికిత్స చేసి 2.51సెంటీమీటర్ల రాళ్లుకలిగిన పిత్తాశయాన్ని తొలగించారు. రెండు శస్త్ర చికిత్సలు ఏకకాలంలోనే విజయవంతంగా నిర్వహించి రోగిప్రాణాలు కాపాడారు.