MLA Padmarao Goud | సికింద్రాబాద్, డిసెంబర్ 30: సికింద్రాబాద్ సీతాఫల్మండిలోని సెట్విన్ కేంద్రం కార్యకలాపాలను విస్తరించేందుకు ఏర్పా ట్లు జరుపుతున్నామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. సీతాఫల్మండిలో నిర్మిస్తున్న సెట్విన్ భవనం అదనపు అంతస్తుల నిర్మాణ పనులను పద్మారావు గౌడ్ సోమవారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత దశాబ్ద కాలంలో సెట్విన్ ద్వారా వివిధ ప్రాంతాలకు చెందిన పేద, మధ్య తరగతుల విద్యార్థులకు శిక్షణ కల్పించి ఉపాధిని ఏర్పర్చామని, మరిన్ని కొత్త కోర్సులను ప్రారంభించేందుకు వీలుగా అదనంగా వసతిని కల్పించేందుకు భవనాలను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యతను పాటించాలని, వివిధ కోర్సుల నిర్వహణకు వీలుగా భవన సముదాయాన్ని నిర్మించాలని పద్మారావు గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమంలో సీతాఫల్మండి సెట్విన్ సెంటర్ ఇన్చార్జ్ అనిత, ఇతర అధికారులు పాల్గొన్నారు.