ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 19- ప్రస్తుత రోజుల్లో సంక్లిష్టంగా మారిన మురుగునీటి సరఫరా అవరోధాలను అధిగమించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం బృందం ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేసింది. ప్రొఫెసర్ కే శశికాంత్ నేతృత్వంలో అధ్యాపకులు, విద్యార్థులు ఐఓటీ ఆధారిత మురుగునీటి పర్యవేక్షణ వ్యవస్థను రూపొందించింది. దీని ఆధారంగా మురుగునీరు పొంగిపొర్లడంతో పాటు హానికర వాయువుల విడుదలను గుర్తించవచ్చు. పారిశుద్ధ్య కార్మికుల భద్రతతో పాటు సమర్థవంతమైన పట్టణ వ్యర్థాల నిర్వహణ కూడా సాధ్యమవుతుంది.
దీనికి సంబంధించిన పరిశోధన పత్రాన్ని అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ (ఎ.ఎస్.సి.ఇ.) ఆధ్వర్యంలో చండీగఢ్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సైస్టెనబుల్ స్మార్ట్ సిటీస్ లో సమర్పించారు. ఈ వ్యవస్థలో అధునాతన వాయు, జల సెన్సార్ల ద్వారా పొంగిపొర్లడం, విషవాయువులు తదితర సమయాల్లో అధికారులను అప్రమత్తం చేస్తుంది. ఇటీవల కాలంలో డ్రైనేజీలో వెలువడుతున్న విషవాయువుల కారణంగా పారిశుద్ధ్య కార్మికులు మృతి చెందడం, అనారోగ్యాల బారిన పడటం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం బృందం చేపట్టిన ఈ పరిశోధన కీలకంగా మారనుంది. ఈ సందర్భంగా ఈ బృందాన్ని ఓయూ అధికారులు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు అభినందించారు.