హైదరాబాద్, ఆట ప్రతినిధి అక్టోబర్ 27 : ఓయూ కళాశాలల క్రాస్ కంట్రీ మహిళల టీమ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెంటల్ డిగ్రీ కళాశాల మహీంద్రాహిల్స్ సొంతం చేసుకోగా.. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెంటల్ డిగ్రీ కళాశాల మెదక్ జట్టు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల బేగంపేట జట్టు రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ఫురుషుల టీమ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను డాక్టర్ బీఆర్.అంబేద్కర్ కళాశాల జట్టు కైవసం చేసుకుంది.
ఏవీ.కళాశాల, హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఆదివారం ఓయూ సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్‌లో సరోజిని నాయుడు వనితా ఫార్మసీ మహావిద్యాలయ తార్నాక్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించి మహిళల 10 కిలో మీటర్ల పరుగులో మల్లిక (మహీంద్రాహిల్స్), నేరళ్ల అనూష (మహీంద్రాహిల్స్), మహాలక్ష్మి (ఎస్ఎన్ వనితా మహావిద్యాల) మొదటి మూడు స్థానాలను దక్కించుకున్నారు.
ఫురుషుల 10 కిలో మీటర్ల పరుగులో మహేశ్, కిరణ్ (దోమల్‌గూడ ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల), ఎన్.ధోని (హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల)లు అగ్రస్థానాలను దక్కించుకున్నారు. విజేతలకు హైదరాబాద్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజేశ్‌కుమార్ ట్రోఫీని అందజేశారు.