వ్యవసాయ యూనివర్సిటీ, సెప్టెంబర్ 1: వ్యవసాయ రంగమే దేశానికి దిక్సూచీ అని న్యూఢిల్లీ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ (ఐసీఏఆర్- నార్మ్)డా. జె.సి. కథ్యాల్ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఐసీఏఆర్- నార్మ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన 48వ వ్యవస్థాపక దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత్లో 70 శాతానికి పైగా వ్యవసాయ, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనం సాగించే వారే ఉన్నారన్నారు. అందుకు అనుగుణంగా నేలలు, నీరు , వాతావరణ పరిస్థితులు ఉన్నాయన్నారు. ఉన్న వనరులను గుర్తించి, యువత ప్రాధాన్యత పెంచాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఆయా రాష్ర్టాలలో ఉన్న వనరులను ఉపయోగించుకుంటే అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రంలా మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. 1978 నుంచి రాజేంద్రనగర్ నార్మ్లో వ్యవసాయ పరిశోధనలు, వ్యవసాయ విస్తరణ విద్య గూర్చి శిక్షణ, పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 81 శిక్షణా కార్యక్రమాల ద్వారా 5,971 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. వ్యవసాయ అనుబంధ కోర్సులలో డిగ్రీ పూర్తి చేసిన వారికి పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్- అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్పై శిక్షణ ఇచ్చామన్నారు.
దేశ నలు మూలలా వారిని వ్యవసాయ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్ది, రైతులకు ప్రత్యక్ష, పరోక్షంగా అండగా నిలిచారన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన యువ శాస్త్రవేత్తలు తెలంగాణలో జరుగుతున్న మార్పులను ఆదర్శంగా తీసుకునేలా విధి విధానాలు ఉండాలని సూచించారు. కొన్ని రాష్ర్టాలలో వ్యవసాయ వనరులు ఉన్నప్పటికీ.. ఇతర రంగాల కొరకు పాకులాడి అపార నష్టాలను చవి చూస్తున్నారని తెలిపారు. సాగు పరిశోధన రంగాలలో ఉత్తర భారత్కు తీసిపోని విధంగా, దక్షిణ భారత్లో అవకాశాలున్నాయన్నారు. ఇప్పుడిప్పుడే దక్షిణ ప్రాంతంలో కూడా శాస్త్రవేత్తలు కృషి చేయడం అభినందనీయమన్నారు. దేశంలోని నార్మ్ ఆధ్వర్యంలో 300 స్టార్టప్స్, 40 కేంద్రాలు ఉన్నాయన్నారు. నార్మ్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ సైంటిస్ట్, టెక్నికల్ ఫ్యాకల్టీలతోపాటు తదితర రంగాలలో ప్రతిభ కనబర్చిన వారికి ముఖ్య అతిథులు డా. యశ్వంత్, దండపాణి, డా.అనీజా తదితరులు బహుమతులు ప్రదానం చేశారు. యువ శాస్త్రవేత్తలు పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు.