ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 18: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో శుక్రవారం నిర్వహించనున్న అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. మొహరం పండుగ సెలవును గురువారం నుంచి శుక్రవారానికి మార్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పరీక్షలు నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. శనివారం నుంచి నిర్వహించబోయే పరీక్షలను యథావిధిగా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలోని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్స్- 2021 వెబ్సైట్ శని, ఆదివారాల్లో పనిచేయదని సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఐ.పాండురంగారెడ్డి తెలిపారు. వెబ్సైట్ నిర్వహణ కారణంగా ఫీజు చెల్లింపు, దరఖాస్తు నమోదు తదితర సేవలేవీ పనిచేయవని చెప్పారు. అభ్యర్థులు సరైన సమయంలో ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని, చివరి రోజు వరకు వేచి చూడకూడదని సూచించారు. పరీక్షకు హాజరై, అర్హత సాధించినంత మాత్రాన కచ్చితంగా సీటు పొందుతామని అనుకోవడానికి లేదని, కోర్సులో చేరేందుకు అన్ని అర్హతలు ఉండాల్సిందేనన్నారు.