హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని ఇనాంగూడలో విషాదం చోటుచేసుకున్నది. పాల ప్యాకెట్ కోసం కుమారుడితో వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో (Road Accident) మృతిచెందారు. గురువారం ఉదయం అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని ఇనాంగూడలో శెట్టి కనక ప్రసాద్ అనే వ్యక్తి తన రెండేండ్ల కుమారుడితో కలిసి బైక్పై పాలప్యాకెట్ తీసుకొచ్చేందుకు వెళ్లారు. ఈ క్రమంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వారి బైక్ను చౌటుప్పల్ వైపు నుంచి వచ్చిన డీసీఎం వ్యాను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రసాద్ ఘటనా స్థలంలోనే మృతిచెందారు. బాలుడికి స్వల్పంగా గాయాలయ్యాయి. తండ్రి మృతదేహం పక్కనే కూర్చుని బాలుడు రోదిస్తూ కూర్చున్నాడు. ఈ ఘటన అందరినీ కలచివేసింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడిని దవాఖానకు తరలించారు. మృతుడు ఆంధ్రప్రదేశ్లోని కొవ్వూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. జీవనోపాధి కోసం ఆయన కుటుంబం పది రోజుల క్రితమే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.